నేనే స్వయంగా విచారణ ఎదుర్కొంటా!

1 Sep, 2016 15:01 IST|Sakshi
నేనే స్వయంగా విచారణ ఎదుర్కొంటా!

న్యూఢిల్లీ: ఆరెస్సెస్‌ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమని 2014 సాధారణ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నిందించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మహాత్మాగాంధీకి హత్యకు ఆరెస్సెస్‌ ఓ సంస్థగా బాధ్యురాలు కాదని, కానీ, ఆ సంస్థకు అనుబంధమున్న వ్యక్తులే ఆయనను 1948లో కాల్చిచంపారని తాను పేర్కొన్నట్టు గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు రాహుల్‌గాంధీ తెలిపిన సంగతి తెలిసింది. ఇదే విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోని, మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ను నిందించలేదని రాహుల్‌ పేర్కొంటే.. ఆయనపై దాఖలుచేసిన పరువునష్టం కేసును ఉపసంహరించుకుంటామని ఆరెస్సెస్‌ స్పష్టం చేసింది. అయితే, ఆరెస్సెస్‌ సూచనను తాజా విచారణలో రాహుల్‌ తిరస్కరించారు. మహాత్మాగాంధీ హత్య విషయంలో తాను పేర్కొన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఈ కేసులో తాను విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ గురువారం న్యాయస్థానానికి తెలిపారు.

ఆరెస్సెస్‌ కార్యకర్త ఒకరు దాఖలు చేసిన పరువునష్టం కేసు విషయంలో రాహుల్‌ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ చేపడుతున్న దిగువ కోర్టులో వ్యక్తిగత హాజరును మినహాయించాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. అయినప్పటికీ ఈ కేసు విచారణను ఎదుర్కొంటానని, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలును ఉపసంహరించుకుంటానని రాహుల్‌ తాజాగా తెలిపారు.

మరిన్ని వార్తలు