మళ్లీ తలై‘వా’

30 Mar, 2017 04:06 IST|Sakshi
మళ్లీ తలై‘వా’

దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రప్పించేందుకు అభిమాన లోకం మళ్లీ తలై‘వా’...అని నినదించే పనిలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో బుధవారం హల్‌చల్‌ చేసిన పోస్టర్లు ఈ చర్చకు తెర లేపాయి. అభిమానులతో కథానాయకుడు భేటీ కానున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఏప్రిల్‌ రెండున కీలక నిర్ణయం ప్రకటన అన్నట్టు సంకేతాలు హోరెత్తాయి.

సాక్షి, చెన్నై : అశేషాభిమాన లోకం మన్నల్ని అందుకుం టున్న కథానాయకుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు అప్పుడుప్పుడు తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. తమ పెద్దలతో సన్నిహితంగా ఉండే రజనీని ఆకర్షించే రీతిలో కమలనాథులు తీవ్ర కుస్తీలు పట్టినా, ఫలితం శూన్యం. రాజకీయ అరంగేట్ర నినాదం తెర మీదకు వచ్చినప్పుడల్లా, దేవుడు ఆదేశిస్తే.. అంటూ తన దైన శైలి హావభావాలతో రజనీకాంత్‌ ముందుకు సాగుతుంటారు. ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీ రాజకీయాల్లోకి రావాలన్న నినాదం మిన్నంటింది.

 ఈ నినాదంపై తన సన్నిహితులతో కథనాయకుడు  చర్చలు జరుపుతున్నట్టుగా రాష్ట్రంలో ప్రచారం కూడా బయలు దేరింది. అయితే, సూపర్‌స్టార్‌ మాత్రం ఎక్కడ ఎవ్వరికీ చిక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు రెండు రోజులుగా తలై‘వా’ అన్న నినాదాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చి పోస్టర్లతో హల్‌ చల్‌ సృష్టించే పనిలో పడ్డారు. బుధవారం ఓ అడగు ముందుకు వేసినట్టుగా ఏర్పాటైన పోస్టర్లు ఈ చర్చకు దారి తీశాయి. శ్రీలంక పర్యటన చివరి క్షణంలో రద్దు కావడం, రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేందుకు తమ నాయకుడు సిద్ధం అవుతోన్నట్టుగా ప్రచారాన్ని అభిమానులు ఊపందుకునేలా చేయడం గమనార్హం.

 అదే సమయంలో  ఏప్రిల్‌ రెండో తేదీన అభిమానులతో రజనీ భేటీ కానున్నారని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులకు ఆహ్వానం పలికి ఉన్నట్టు, ఏడు వేల మందితో సాగనున్న భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం హోరెత్తడంతో తమిళ మీడియాల్లో ప్రాధాన్యత పెరిగింది. శ్రీలంక పర్యటన రద్దుపై రజనీకాంత్‌ అక్కడి ఈలం తమిళులకు బుధవారం ఓ లేఖ రాయడంతో అభిమానుల్లో ఉత్సాహం బయలు దేరింది.

సమయం అనుకూలిస్తే ఈలం తమిళుల్ని తప్పకుండా కలుస్తా అని ఆయన రాసిన లేఖతో అభిమానులు కాస్త అత్యుత్సాహం, దూకుడు ప్రదర్శించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. తమిళనాట సమయం అనుకూలంగానే ఉన్నట్టు, రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చే పనిలో పడడం గమనార్హం. కోడంబాక్కం రాఘవేంద్రకల్యాణ మండపం వేదికగా ఏప్రిల్‌ రెండో తేదీన రజనీకాంత్‌ అభిమానులతో భేటీ కానున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో, అలాంటి కార్యాచరణే లేదంటూ ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు