వస్తువులపై ఇక ఎంఆర్పీ స్టాంప్ ఉండదా?

21 Mar, 2017 09:56 IST|Sakshi
వస్తువులపై ఇక ఎంఆర్పీ స్టాంప్ ఉండదా?
నిత్య వాడుకలో వినియోగించే వస్తువులపై ఇన్నిరోజులు కనిపించే  ఎంఆర్పీ(మ్యాక్సిమర్ రిటైల్ ప్రైస్) లేబల్ ఇక మనకు కనిపించదు. గ్లోబల్ రిటైలర్లకు నిబంధనలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం   ఎంఆర్పీ స్టాంప్ కు శరాఘతం పలికేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఎంఆర్పీ ఉండాలనే నిబంధనను తీసివేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఉందని కానీ స్టోర్లో అందించే ప్రతి వస్తువుపైనే ఎంఆర్పీ స్టాంప్ ఉండాలనే ప్రక్రియ చాలా గజిబిజిగా ఉందని  సింగిల్ బ్రాండు రిటైలర్లు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు  ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. చాలా దేశాల్లో ఎంఆర్పీ ట్యాగ్  ఉండదు. కేవలం భారత్ లో మాత్రమే దీన్ని అమలుచేస్తున్నారు.  
 
వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయించకుండా.. సింగిల్ బ్రాండు స్టోర్లలో విక్రయించే వస్తువులపై ఎంఆర్పీ ట్యాగ్ కచ్చితమనే నిబంధనను వినియోగదారుల వ్యవహారాల డిపార్ట్ మెంట్ అమలుచేస్తోంది.  చాలా స్టోర్లు ఎంఆర్పీ ధరల కంటే తక్కువగానే వస్తువులను విక్రయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఎంఆర్పీ ట్యాగ్ నే పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తీసివేయడానికి ప్రభుత్వం చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా భారత్ నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కూడా కేంద్రబడ్జెట్ లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును తొలగిస్తున్నట్టు  ప్రకటించి, ఎఫ్డీఐ నిబంధనలను మరింత సులభతరం చేశారు. ప్రస్తుతం ఎంఆర్పీ ట్యాగ్ ను కూడా తొలగించి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 
మరిన్ని వార్తలు