ఉక్కు సంకల్పం .. యాభై రోజులుగా ఆగని సమైక్య పోరు

19 Sep, 2013 02:35 IST|Sakshi
ఉక్కు సంకల్పం .. యాభై రోజులుగా ఆగని సమైక్య పోరు

సాక్షి నెట్‌వర్క్ : సరిగ్గా యాభైరోజుల కిందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్య ఉద్యమం జన నినాదమై ఉప్పెనలా సాగుతోంది. ప్రజోద్యమానికి సకల జనుల సమ్మె, ఆర్టీసీ సమ్మె తోడు కావడంతో సీమాంధ్ర జిల్లాల్లో పాలన స్తంభించింది. ఎన్ని ఇబ్బందులెదురవుతున్నా జనం సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణే  లక్ష్యంగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బెల్లుపడలో రైతుగర్జన పేరుతో ర్యాలీ నిర్వహించారు. కొత్తూరులో క్రైస్తవులు ర్యాలీ చేపట్టగా పాలకొండలో సర్వమత ప్రార్థనలు చేశారు. ఆమదాలవలసలో ఉపాధ్యాయులు, ఎచ్చెర్ల అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు హోమాలు చేయించారు.
 
 విజయనగరంలోని జాతీయ రహదారిపై మహిళలు లలితాపారాయణం చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. నెల్లిమర్లలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నడిరోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని పాడేరు, లంబసింగి, జి.మాడుగుల ప్రాంతాల్లో బంద్ జరిగింది. చింతపల్లిలో 11 మండలాల జీసీసీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి బంద్ చేయించారు. మల్కాపురంలోని ఐవోఎల్ కంపెనీ గేట్ వద్ద 700 ఆయిల్ ట్యాంకర్ల నిర్వాహకులు రవాణాను నిలిపివేశారు. రాష్ట్రం విడిపోతే నదీ జలాల సమస్య తలెత్తి, వ్యవసాయం అనుబంధ రంగాలు దెబ్బ తింటాయని, పశువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ కం రైలు వంతెనపై పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు గొర్రెలతో ర్యాలీ చేశారు.
 
 విభజన జరిగితే గడ్డితిని బతకాలంటూ మండపేటలో ఉపాధ్యాయులు గడ్డి తిని నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి తాడేపల్లిగూడెంలో పాదయాత్ర ప్రారంభించారు. కృష్ణా జిల్లా కౌతవరంలో వేలాది స్వశక్తి సంఘాల మహిళలు మానవహారం నిర్వహించారు. విజయవాడలో మున్సిపల్ ఉద్యోగులు బైక్ ర్యాలీతో గిరిప్రదక్షిణ చేశారు. భవన నిర్మాణశాఖ ఉద్యోగులు గుడివాడలో భారీ ప్రదర్శన చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అంధులు రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. సత్తెనపల్లిలో జలదీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సర్పంచ్‌లు సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు.
 
 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయిలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో  రెవెన్యూ సిబ్బంది కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. ఎన్జీఓలు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వఠిద్ద ఆ సంస్థ కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గంగవ రంలో ఉపాధ్యాయులు గొర్రెల మందకు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని బోయనపల్లె వద్ద జాతీయ రహదారిని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. జమ్మలమడుగులో విద్యుత్ ఉద్యోగులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు విద్యుత్ షాక్ ఇచ్చి దహనం చేశారు.  ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి నేతృత్వంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. అనంతపురంలో వ్యవసాయశాఖ అధికారులు భిక్షాటన చేశారు. విభజన జరిగితే మా బతుకులు బుగ్గి పాలవుతాయంటూ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గార్లదిన్నెలో వైఎస్సార్ సీపీ నేత పూజారి మాధవ ఆమరణ దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ నిర్వహించారు. కాగా, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి బహుబలి రామరాజు (57) మంగళవారం టీవీలో ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతిచెందాడు.
 
 
లక్ష గళ గర్జన.. సమైక్య శంఖారావం.. భారీ మానవహారం... ఇలా వివిధ పేర్లతో విభిన్న రూపాల్లో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి తరలివచ్చి సమైక్య నినాదాలు హోరెత్తిస్తున్నారు. బుధవారం వైఎస్సార్ జిల్లా కడప నగరం రింగ్‌రోడ్డు చుట్టూ 36 కిలోమీటర్ల మేర వేలాది మంది మానవహారంగా ఏర్పడి సమైక్య ఆకాంక్షను వ్యక్తం చేశారు. నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు స్వచ్ఛందంగా హాజరై రోడ్డు వెంబడి సమైక్య నినాదాలను హోరెత్తించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో విద్యార్థి, యువ జేఏసీ ఆధ్వర్యంలో జనగోదావరి సభ నిర్వహించారు.
 
 ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సభకు జనం పోటెత్తారు. కొవ్వూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ గర్జన నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో మహాగళార్చన, బుట్టాయగూడెంలో సమైక్యాంధ్ర ఏజెన్సీ ప్రజాగర్జన చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో  సమైక్య శంఖారావం నిర్వహించారు. పాతిక వేలమందికి పైగా ప్రజలు ఒక్క చోటకు చేరి ముక్తకంఠంతో  జై సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగించారు, సమైక్యాంద్రప్రదేశ్‌ను సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నెల్లూరు జిల్లా  వెంకటగిరిలో పద్మశాలి సింహగర్జన పేరిట మహార్యాలీ చేపట్టారు. కోవూరులో సమైక్య సమరభేరి సభ, కలిగిరిలో మహిళా గర్జన, పొదలకూరులో యాదవ గర్జన నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేలాది మంది పాల్గొన్న మహిళా గర్జనలో సమైక్య    నినాదాలు మార్మోగాయి.     - సాక్షి నెట్‌వర్క్
 
 టీచర్ల సద్భావనా యాత్ర ప్రారంభం
 ఇడుపులపాయ : ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విడగొడుతామంటూ ఢిల్లీలో సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయం తిరిగి వెనక్కి తీసుకునేవరకు ఉద్యమం ఆగదని వైఎస్‌ఆర్‌టీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సీమాంధ్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సమైక్యాంధ్ర ఉపాధ్యాయ సద్భావన యాత్రను బుధవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఘాట్ వద్ద  వైఎస్సార్ సీపీ ముఖ్య నేత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉపాధ్యాయులతో కలిసి గంగిరెడ్డి వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.

 హైదరాబాద్ బయల్దేరిన సమైక్య గణపతి
 నేటి ఉదయం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం
 గుంటూరు : సమైక్యాంధ్ర నినాదంతో గుంటూరులో ఏర్పాటుచేసిన పది అడుగుల సమైక్య గణపతి విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో గురువారం నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరారు. అరండల్‌పేటలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన సమైక్యవాదులు బుధవారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు.

మరిన్ని వార్తలు