వడ్డీరేట్లు పెంచే ఆలోచన లేదు

3 Aug, 2013 01:34 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్లు, రుణాలపై వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పష్టం చేసింది. ఇతర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్న తరుణంలో దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ మాత్రం అటువంటి ఆలోచన లేదని పేర్కొంది. తమ డిపాజిట్ల సేకరణ వ్యయం తక్కువగా ఉండటంతో రుణాలపై వడ్డీలను పెంచాల్సిన అవసరం లేదని, అలాగే డిపాజిట్లలో తగినంత వృద్ధి ఉండటంతో వీటిపై కూడా వడ్డీరేట్లను పెంచడం లేదని ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి ‘సాక్షి’తో అన్నారు.
 
 హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం వచ్చిన ఆయన మాట్లాడుతూ మిగిలిన బ్యాంకుల్లో డిపాజిట్లపై ఒత్తిడి ఉంది కాని ఎస్‌బీఐ విషయానికి వచ్చేసరికి డిపాజిట్లలో 16 శాతంపైగా వృద్ధి ఉందన్నారు. వడ్డీ లాభదాయకతపై కూడా ఎటువంటి ఒత్తిడి లేదని, పూర్తి సంవత్సరానికి వడ్డీ లాభదాయకత(ఎన్‌ఐఎం) 3.6%గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ రుణాల నుంచి ఎలాంటి డిమాండ్ కనిపించడం లేదని, కాని రిటైల్ రంగంలో డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది రుణాల్లో 20% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ వడ్డీరేట్లు తక్కువని, ఎంపిక చేసిన కార్పొరేట్లకు రీ-ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు చౌదరి తెలిపారు. ఇక మొండి బకాయిల విషయానికి వస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పడితే కాని ఈ సమస్యకు పరిష్కారం లభించదన్నారు.

మరిన్ని వార్తలు