పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ తగ్గింపు

29 Aug, 2023 02:44 IST|Sakshi

సీఎం జగన్‌ విజ్ఞప్తి మేరకు ఎస్‌బీఐ సానుకూల స్పందన 

తాజా నిర్ణయంతో ఏటా వడ్డీభారం రూ.100కోట్లు తగ్గుతుందని అంచనా 

వడ్డీ రేటు 12.15 శాతం నుంచి  9.90 శాతానికి కుదింపు 

రూ.5 లక్షలు పైబడిన రుణాలకే ఇది వర్తింపు 

ఈ మేరకు ప్రభుత్వానికి ఎస్‌బీఐ లేఖ  

రాష్టంలోని పొదుపు సంఘాల రుణాల్లో 22.5 శాతం ఎస్‌బీఐ నుంచే.. 

మిగతా బ్యాంకులూ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం : అధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు.. ఈ రుణాలపై రెండున్నర శాతం మేర వడ్డీ తగ్గింపుతో పాటు ఆయా రుణాలపై ఎలాంటి అదనపు (ఇన్‌స్పెక్షన్, యాన్యువల్‌ రివ్యూ లేదా రెన్యూవల్‌ పేర్లతో వసూలు) చార్జీలను పూర్తిగా మినహాయించేలా నిర్ణయం తీసుకుంది. సాధారణంగా.. బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘పొదుపు’ రుణాలపై రూ.మూడు లక్షల వరకు కేవలం ఏడు శాతం వడ్డీకే రుణాలు ఇస్తుంటాయి.

రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య రుణాలపై ఆయా బ్యాంకులు నిర్దేశించుకునే నిర్ణీత ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు – రుణాలు ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు నిర్దేశించుకున్న కనీస వడ్డీ రేటు) ప్రకారం మాత్రమే రుణాలు అందజేయాల్సి ఉంటుంది. ఈ ఎంసీఎల్‌ఆర్‌ అన్నది ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా.. ఒకే బ్యాంకులో ఒక్కో సమయంలో ఒక్కొక్క వడ్డీరేటు కూడా ఉంటుంది. అయితే, రూ.5 లక్షల పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై ఆయా బ్యాంకులు తమ విచక్షణ మేరకు వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చుకోవచ్చు.

ఇలా.. ఐదు లక్షలకు పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై కొన్ని బ్యాంకులు గరిష్టంగా 13 శాతం వడ్డీ రేటుకు కూడా రుణాలిస్తున్నాయి. ఇప్పుడు.. ఎస్‌బీఐ పొదుపు రుణాలపై రూ.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తాలపై 12.15 శాతం వడ్డీ రేటును 2.25 శాతం తగ్గించుకుని 9.90 శాతానికే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపింది.

అదే రూ.10 లక్షలకు పైబడి రూ.20 లక్షలలోపు రుణాలపై కూడా 12.15 శాతం ఉన్న  వడ్డీ రేటును 2.45 శాతం తగ్గించుకుని 9.70 శాతానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. పొదుపు రుణాలను సకాలంలో చెల్లించే విషయంలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉండడంతో ఎస్‌బీఐ వడ్డీ రేటు తగ్గింపునకు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. 

2024 మార్చి నెలాఖరు వరకు.. 
ఇక మహిళలు తీసుకునే ‘పొదుపు’ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఈ ఏడాది మార్చి 10న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్వయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లను కోరారు. పొదుపు రుణాలపై ప్రొసెసింగ్‌ ఫీజు, ఇన్‌స్పెక్షన్‌ తదితర పేర్లతో అదనపు ఫీజులు కూడా వసూలు చెయ్యొద్దని ఆ సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత కూడా ఇదే అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఎండీ ఇంతియాజ్‌ పలు దఫాలుగా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ అప్పట్లోనే తాత్కాలికంగా నాలుగు నెలల కాలానికి, అంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జులై 31 వరకు తీసుకునే రూ.5 లక్షల పైబడిన పొదుపు రుణాలపై దాదాపు రెండు శాతం తగ్గించడానికి అనుమతి తెలిపింది.

ఆ గడువు ముగియడంతో సెర్ప్‌ అధికారులు మళ్లీ రెండేళ్లపాటు వడ్డీ తగ్గించాలంటూ ఎస్‌బీఐకి లేఖ రాశారు. దీంతో ఆ బ్యాంకు ప్రాంతీయ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్పందిస్తూ.. 2024 మార్చి నెలాఖరు వరకు రూ.ఐదు లక్షలకు పైబడిన పొదుపు రుణాలపై 2.15 శాతం నుంచి 2.45 శాతం తక్కువ వడ్డీరేటుకే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపారు.

అలాగే, రూ.20 లక్షల వరకు ఎలాంటి ప్రొసెసింగ్‌ చార్జీలు, ఇన్‌స్పెక్షన్‌ చార్జీలు, యాన్యువల్‌ రివ్యూ లేదా రెన్యూవల్‌ ఛార్జీలు వంటివి అదనంగా వసూలు చేయబోమని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు.

నాలుగో వంతు రుణాలు ఎస్‌బీఐ నుంచే.. 
రాష్ట్రంలోని పొదుపు రుణాల్లో దాదాపు నాలుగో వంతు ఎస్‌బీఐ నుంచే తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు ఒక్క ఎస్‌బీఐ నుంచే రూ.9,378.24 కోట్ల రుణాలు తీసుకోగా.. పట్టణ ప్రాంతాల్లో రూ.2,565 కోట్ల రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.

అలాగే, గ్రామీణ మహిళలు తీసుకున్న రూ.9,378.24 కోట్లలో ఐదు లక్షలకు పైబడి కేటగిరిలో రూ.2,765 కోట్ల దాకా ఉన్నాయని.. వీటిపై ఇప్పుడు ఆ బ్యాంకు తీసుకున్న వడ్డీరేటు తగ్గింపు నిర్ణయంతో ఏటా రూ.వంద కోట్ల వరకు వడ్డీ భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అదే విధంగా.. పట్టణ ప్రాంతంలో తీసుకున్న రుణం రూ.2,565 కోట్లలో రూ.5 లక్షల పైబడిన రుణాల్లో దాదాపు రూ.600 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ఇతర బ్యాంకులు సైతం భవిష్యత్‌లో వడ్డీ రేటు తగ్గించే అవకాశం లేకపోలే­దని అధికారులు చెబుతున్నారు.

మిగిలిన బ్యాంకులతోనూ సంప్రదింపులు..  
ఇక పొదుపు రుణాలకు సంబంధించి అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతోనూ వడ్డీ రేటు తగ్గింపు గురించి ప్రభుత్వంతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కార్యాలయం కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. త్వరలోనే ఆయా బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం.   – ఎండీ ఇంతియాజ్, సెర్ప్‌ సీఈవో

మరిన్ని వార్తలు