శివసేన ఎంపీ వీరంగం

24 Mar, 2017 09:42 IST|Sakshi
శివసేన ఎంపీ వీరంగం

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ రెచ్చిపోయారు. ఎయిరిండియా ఉద్యోగిపై ప్రతాపం చూపారు. ఎయిరిండియాకు చెందిన డ్యూటీ మేనేజర్‌పై చెప్పుతో దాడికి దిగి 25సార్లు కొట్టారు. ఆయన చొక్కాను చించేశారు. ఇదంతా ఇక్కడి ఐజీఐ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ కలిగిన తనకు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణ సదుపాయం కల్పించారన్న ఆవేశాన్ని ఆపుకోలేక ఎంపీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం పుణే నుంచి ఢిల్లీకి విమానం చేరుకున్న తరువాత వెంటనే కిందకు దిగేందుకు ఎంపీ తిరస్కరించారు. దీంతో ఎయిరిండియా సిబ్బందికి, ఆయనకు మధ్య వాదన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎయిరిండియా డ్యూటీ మేనేజర్‌ సుకుమార్‌పై ఎంపీ విరుచుకుపడడమేగాక చెప్పుతో పలుమార్లు కొట్టారు.

 అంతేగాక జరిగిన ఘటనను ఎంపీ సమర్థించుకున్నారు. తనతో దురుసుగా ప్రవర్తించడంతోనే ఆవేశానికి లోనైనట్టు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఎయిరిండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఎంపీపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎయిరిండియా అధికారి సుకుమార్‌ను వైద్య పరీక్షలకు పంపినట్టు తెలిపారు. కాగా విమానం ల్యాండయ్యాక కిందకు దిగకపోవడం ద్వారా విమానం క్లీనింగ్‌ 40 నిమిషాలపాటు జాప్యమయ్యేందుకు కారణమయ్యారంటూ ఎంపీపై మరో ఫిర్యాదును సైతం దాఖలు చేసినట్టు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
 

మరిన్ని వార్తలు