త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలు

8 Oct, 2015 01:07 IST|Sakshi
త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలు

సాధ్యాసాధ్యాలపై కమిటీ
ఎఫ్‌డీఐ వాటా పెంచుకోవడానికి ముందుకొచ్చిన ఏడు కంపెనీలు
చౌకగా పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలి
ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి ఏటా పాలసీని రెన్యువల్ చేయించుకోనవసరం లేకుండా బహుళ సంవత్సరాలు అమల్లో ఉండే ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఐఆర్‌డీఏ ఉంది. అన్ని వైపుల నుంచి దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలకు డిమాండ్ రావడంతో దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విజయన్ కలసిన విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక పాలసీలకు డిమాండ్ బాగుండటంతో కార్లు, ఆరోగ్య బీమా పాలసీల్లో కూడా దీన్ని అమలు చేయాలని కంపెనీలు కోరుతున్నాయన్నారు. తక్కువ కాలంలోనే దీర్ఘకాలిక ద్విచక్ర వాహన పాలసీల అమ్మకాలు లక్ష మార్కును అందుకోవడంపై విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీలు డిజిటలైజేషన్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను తగ్గించుకొని తక్కువ ప్రీమియంకే పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 80 శాతం ఆస్తులకు బీమా రక్షణ ఉందని, కానీ ఇండియాలో ఇది కేవలం 7 శాతంగా ఉందన్నారు. బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెంపు అనుమతి కోరుతూ కంపెనీల నుంచి అధికారికంగా ఎటువంటి దరఖాస్తులు అందలేదని, కానీ ఆరు నుంచి ఏడు కంపెనీలు ఎఫ్‌డీఐ వాటాను పెంచుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పరిశ్రమకంటే బెటర్
ఈ ఏడాది పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించగలమన్న ధీమాను సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో సాధారణ బీమా రంగంలో 10 నుంచి 11 శాతం వృద్ధి నమోదైతే, ఇదే సమయంలో తాము 18 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 7,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది.
 

మరిన్ని వార్తలు