టీ20లో సంచలనం.. సున్నాకు 6 వికెట్లు!

17 Jan, 2017 18:07 IST|Sakshi
టీ20లో సంచలనం.. సున్నాకు 6 వికెట్లు!

లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సర్ఫరాజ్‌ అష్రఫ్‌ టీ-20లో అరుదైన ఘనతను సాధించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన టీ20 పోటీల్లో అతను ఈ రికార్డు సాధించాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన టీ20 మ్యాచ్‌లో యంగ్‌ పాయినీర్స్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున ఆడిన సర్ఫరాజ్‌... మెర్కారా యూత్‌ క్రికెట్‌ క్లబ్‌ బ్యాట్స్‌ మెన్‌ ను తన స్పిన్‌తో వణికించాడు. ఒక హ్యాట్రిక్‌ కూడా సాధించాడు. దీంతో అతని జట్టు 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సర్ఫరాజ్‌ సాధించిన ఆరు వికెట్లలో ఐదు వికెట్లు వరుస బంతులలో సాధించాడు. నిజానికి సర్ఫరాజ్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించే చాన్స్‌ కూడా తృటిలో మిస్సైంది. అతను విసిరిన మూడో బంతికి ఎల్‌బీడబ్ల్యూకి అప్పీల్‌ చేసినప్పటికీ ఎంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు.

’పరుగులను కట్టడి చేయాలంటే దూకుడుగా బౌలింగ్‌ చేయాలని నేను భావిస్తా. అదే నాకు వికెట్లు సంపాదించి పెడుతుంది. శ్రీలంక బౌలర్‌ మలింగ తరహాలో విభిన్న యాక‌్షన్‌ తో బౌలింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ ను తికమకపెడతాను’ అని మ్యాచ్‌ అనంతరం సర్ఫరాజ్‌ మీడియాకు తెలిపాడు. బిహార్‌ ముజఫర్‌పూర్‌కు చెందిన సర్ఫరాజ్‌ బీసీసీఐ దేశీయ టీ20 టోర్నమెంట్‌ సయెద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ తరఫున ఆడాడు. గతంలో ఎయిరిండియా జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఒడిశాతో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌ తరఫున చివరిసారిగా ఆడిన సర్ఫరాజ్‌ ఇప్పటివరకు భారత ఏ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. ఈసారి ఏ జట్టుతోపాటు ఐపీఎల్‌లోనూ తనకు అదృష్టం​వరిస్తుందని సర్ఫరాజ్‌ భావిస్తున్నాడు. తన తాజా ప్రదర్శనను సెలెక్టర్లు గుర్తిస్తారని అతను ఆశాభావంతో ఉన్నాడు.

సర్ఫరాజ్‌ మ్యాచ్‌లో విసిరిన ఏడు బంతులు ఇలా సాగాయి..


మొదటి బంతి: ఫస్ట్‌ స్లిప్లో క్యాచ్ ఔట్‌

రెండో బంతి: ఎల్బీడబ్ల్యూ

మూడో బంతి: డాట్

నాలుగో బంతి: ఎల్బీడబ్ల్యూ

ఐదో బంతి: బౌల్డ్

ఆరో బంతి: ఎల్బీడబ్ల్యూ

ఏడో బంతి (రెండో ఓవర్‌ మొదటి బంతి): ఎల్బీడబ్ల్యూ


సంక్షిప్తంగా స్కోర్లు

యంగ్ పయనీర్స్‌ క్లబ్‌: 264/4 20 ఓవర్లు. (సర్ఫరాజ్ అష్రఫ్ 40, దీపక్ 74, కిరణ్ 70, రామ్ (నాటౌట్‌) 22, సునీల్  (నాటౌట్‌) 33, ఎన్ స్వామి 2/56)

మెర్కారా యూత్ క్లబ్‌: 14.3 ఓవర్‌లలో 57 పరుగులకు ఆలౌట్‌. (బ్యాటింగ్‌.. మహేష్ 22; బౌలింగ్‌ మదన్ 3/21, సర్ఫరాజ్ అష్రఫ్ 6/0 (3-3-0-6)

మరిన్ని వార్తలు