'వచ్చే నెల వరకు వారిని అరెస్టు చేయొద్దు'

11 Sep, 2015 12:11 IST|Sakshi

న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం సుప్రీంకోర్టు వారిని అరెస్టు చేయకుండా గడువు మరింత పొడిగించింది. వచ్చే నెల 15 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది.

2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ  సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు