టీచర్లు లేని చోట విద్యా వలంటీర్లు

22 Aug, 2015 01:58 IST|Sakshi
టీచర్లు లేని చోట విద్యా వలంటీర్లు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్లు లేని పాఠశాలల్లో విద్యా వలంటీర్ల(అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల)ను నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 7వేల మందికి పైగా విద్యా వలంటీర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఎంత మంది విద్యా వలంటీర్లు అవసరం, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల స్థాయిల్లో ఎందరు అవసరమన్న వివరాలతో పాఠశాల విద్యాశాఖ ఇదివరకే ప్రభుత్వ ఆమోదం కోసం ఒక ఫైల్‌ను పంపింది. దీనిపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ లెక్కల ప్రకారం...

రాష్ట్రవ్యాప్తంగా 7వేల మందికి పైగా విద్యా వలంటీర్లు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే అందులో ఎక్కువ శాతం ఖాళీలు మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనే, అది కూడా ఎస్జీటీ స్థాయిలోనే ఉన్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో 623, నల్లగొండలో 848, హైదరాబాద్‌లో 909, ఖమ్మంలో 450, వరంగల్‌లో 440, కరీంనగర్ జిల్లాలో 826 ఎస్జీటీ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లుగా గుర్తించింది.

అదనంగా ఉన్న ఈ పోస్టులను స్కూళ్లలో ఉంచకుండా డీఈవోల ఆధీనంలోకి తెచ్చింది. మరోవైపు ఈ ఆరు జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలతో పాటు మొత్తం పది జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు.
 
20 రోజుల్లో నియమిస్తాం: కడియం
జనగామ: ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల స్థానంలో హైకోర్టు ఆదేశాలకు లోబడి 20 రోజుల్లో విద్యా వలంటీర్లను నియమించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం వరంగల్ జిల్లా జనగామలో తెలిపారు. రేషనలైజేషన్‌లో అవకతవకల ఆరోపణల మేరకు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక పాఠశాలల్లో ఖాళీల భర్తీకి వచ్చే ఏడాది డీఎస్సీ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు