18న పార్లమెంట్‌లో బిల్లు!

7 Feb, 2014 01:46 IST|Sakshi
18న పార్లమెంట్‌లో బిల్లు!

* టీబిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం
* రోజూ సభ వాయిదాపై బీజేపీ అసహనం
* బీజేపీ సూచన మేరకు ముహూర్తం మార్పు
* ఆలోపు ఆర్థిక బిల్లులు, ఓటాన్ అకౌంట్ పరిపూర్తి
* సోనియాతో షిండే, జైరాం రమేశ్ భేటీ
 
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముహూర్తం మారింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రక్రియ ముగిసిన తరువాతే దాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఏఐసీసీ వర్గాల సమాచారం మేరకు... ఫిబ్రవరి 18న టీ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. ఈలోపు సభ ముందున్న ఇతర బిల్లులను ఆమోదించుకోవడంతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అలాగే బిల్లును తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టాలా, లేక రాజ్యసభలోనా అనే దానిపై కూడా కసరత్తు చేస్తోంది.

తెలంగాణ బిల్లును ఈ నెల 10న రాజ్యసభలో ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఇటీవల ప్రకటించినా, అది సాధ్యం కాదని తేలిపోయింది. ఇప్పటిదాకా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకే రాలేదు. కేబినెట్ ఆమోదం పొంది, ఆ తర్వాత అది రాష్ట్రపతి వద్దకు వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలూ బిల్లును తిరస్కరించిన నేపథ్యంలో, అత్యంత వివాదాస్పదమైన ఈ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే ఆమోద ముద్ర వేసే అవకాశాలు కన్పించడం లేదు. ఆయనపై ఒత్తిడి తెచ్చి ఆమోదముద్ర వేయించుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో కాంగ్రెస్ పెద్దలు ఈ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు.

మరోవైపు పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగకపోవడంపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విపక్ష పార్టీల సీమాంధ్ర ఎంపీలతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టిస్తున్నప్పుడు టీ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు తాము అనుకూలమైనప్పటికీ జరుగుతున్న ప్రక్రియ మాత్రం అస్సలు సమంజసంగా లేదని చెబుతున్నారు.

ఇదే విషయంపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పార్లమెంట్ సెంట్రల్ హాలులో గురువారం తనను కలిసిన కొందరు ఎంపీలతో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును ఎండగట్టినట్టు తెలిసింది. సొంత పార్టీ ఎంపీలను అదుపులో పెట్టుకోకుండా తెలంగాణ బిల్లును ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించినట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలంటే తెలంగాణ బిల్లును తరవాత ప్రవేశపెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా తొలుత వివాదాస్పదం కాని బిల్లులతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోవాలని, చివర్లో తెలంగాణ బిల్లును సభ ముందుకు తెస్తే మేలని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధానికి, ఇతర కేంద్ర పెద్దలకు చెప్పానని, వాళ్లు కూడా సానుకూలంగా ఉన్నారని అద్వానీ పేర్కొన్నారు.

అద్వానీ సూచనను పరిగణనలోకి తీసుకున్న పార్టీ పెద్దలు పార్లమెంట్‌లో పెండింగ్ బిల్లులను ఆమోదించుకోవాలంటే వివాదాస్పదమైన తెలంగాణ బిల్లును చివర్లో ప్రవేశపెట్టడమే మేలనే భావనకు వచ్చారు. గురువారం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రివర్గ సంఘం (జీఓఎం) సభ్యులు నార్త్ బ్లాక్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లులో చేయాల్సిన మార్పుచేర్పులపై కసరత్తు చేశారు.

బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు, అటు నుంచి రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్‌కు తేవడానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై చర్చించారు. బిల్లును 18న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అనంతరం షిండేతోపాటు గులాంనబీ ఆజాద్, నారాయణస్వామి బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. టీ బిల్లు గురువారం కేంద్ర కేబినెట్ ముందుకు రాదని చెప్పారు. సభలో బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారని ప్రశ్నిస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు అని బదులిచ్చారు. మరోవైపు ఈనెల 10న జరిగే రాజ్యసభ బీఏసీ ఎజెండాలో తెలంగాణ అంశాన్ని చేర్చారు!

సోనియాతో భేటీ
జీవోఎం సమావేశానంతరం షిండే, జైరాం రమేశ్ ఒకే వాహనంలో టెన్ జన్‌పథ్‌కు వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సూచన మేరకు తెలంగాణ బిల్లులో పొందుపర్చిన సవరణలపై చర్చించారు. బిల్లును 18న సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. అందుకు సోనియా ఆమోదముద్ర వేసిందీ లేనిదీ తెలియరాలేదు.

మరిన్ని వార్తలు