ఈసారి రూటు మార్చిన టెర్రరిస్టులు!

12 Jan, 2017 13:26 IST|Sakshi
ఈసారి రూటు మార్చిన టెర్రరిస్టులు!
న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా పలు ముఖ్యమైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఇంటిలిజెన్స్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెర్రరిస్టులు కొత్త రకం దాడులకు పాల‍్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ గురువారం మరోసారి హెచ్చరించింది. కుక్కలను, పిల్లులను, ఎలుకలను ఆత్మాహుతి దాడులుగా మార్చి మారణహోమానికి పన్నాగం పన్నుతున్నారని పేర్కొంది. డీఎన్ఏ రిపోర్టుల ప్రకారం ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్ వంటి పలు ముఖ్యమైన ప్రాంతాలను టెర్రరిస్టులు టార్గెట్ చేశారని,  గణతంత్ర వేడుకల సందర్భంగా వారు కుక్కలతో ఆత్మాహుతికి దాడికి దిగే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉంటాలంటూ ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీచేసింది.
 
శీతాకాల సమయాన్ని అవకాశంగా తీసుకుని , పెంపుడు జంతువులకు వేసే స్వెట్టర్ల ద్వారా దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు వివరించాయి. రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ దాడులు చేస్తారని తెలిపింది. జంతువులను వాడుకుని మొదట సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ టెర్రర్ అటాక్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు పక్షులను సైతం ఉగ్రదాడులకు వాడుకోనున్నాయని తెలుస్తోంది. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు