'సింధురక్షక్' ఘటనలో మూడు మృతదేహలు లభ్యం 

16 Aug, 2013 12:49 IST|Sakshi
'సింధురక్షక్' ఘటనలో మూడు మృతదేహలు లభ్యం 

ముంబై డాక్‌యార్డ్‌లో మంగళవారం అర్ధరాత్రి పేలుడు సంభవించిన ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో మరణించిన నావికుల్లో మూడు  మృతదేహాలను గజ ఈతగాళ్లు ఈ రోజు ఉదయం కనుగొన్నారని నావికాదళ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో వెల్లడించారు. అయితే లభ్యమైన ముగ్గురు మృతదేహాలను గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

 

ఆ ఘటనలో మృతి చెందిన మరో 15 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని వారు తెలిపారు. గత మూడు రోజులుగా మరణించిన ఆ నావిక సిబ్బంది ఆచూకీ కోసం నావికాదళం చేపట్టిన ముమ్మర చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జలాంతర్గామి ఘటనలో మరణించిన వారి వివరాలను న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరణించిన ఆ 18 మంది నావికుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాకు చెందినవారు ఉన్నారు.

 

ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే సింధురక్షక్ మూడేళ్లక్రితం విశాఖతీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని బ్యాటరీ వ్యవస్థ ఉండేచోట పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించాడు. ఆ ప్రమాదం జరిగిన నాలుగు నెలలకు మరో రెండు జలాంత ర్గాములు ఢీకొట్టుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడగల నౌక గురించి మన నావికాదళం 15 ఏళ్లనుంచి పోరాడుతున్నా అరణ్యరోదనే అవుతోంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా 2006లో ఆయన సింధురక్షక్‌లో కొన్ని గంటలు సంచరించినప్పుడు దానికి రక్షణగా అత్యవసర పరిస్థితిలో వినియోగించడం కోసం అమెరికా నుంచి సహాయ నౌకను తెప్పించాల్సివచ్చింది. అది మన నావికాదళానికి అందుబాటులోఉంటే ఇప్పుడు సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం సులభమయ్యేది.

మరిన్ని వార్తలు