తాను వేసిన ఉచ్చులో..

5 Oct, 2023 05:19 IST|Sakshi

యాంకర్‌ చైన్‌కు ఢీకొన్న చైనా అణుజలాంతర్గామి

55 మంది నావికులు మృతి

లండన్‌: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్‌ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్‌ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ  మెయిల్‌ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్‌ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్‌ ఉచ్చులో దాని సబ్‌మెరైన్‌ చిక్కుకుందని డెయిలీ మెయిల్‌ తన కథనంలో పేర్కొంది.

ప్రమాదం ఎలా జరిగిందంటే.. !
ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్‌ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్‌ చైన్‌ను డ్రాగన్‌ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్‌ ఫ్యూరిఫయర్, ఎయిర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు.

సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్‌ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న  55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్‌ కల్నల్‌ జీ యాంగ్‌పెంగ్‌ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్‌ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్‌లు దీనిని తోసిపుచ్చాయి.

జలంతర్గాముల్లో హైడ్రోజన్‌ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్‌ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్‌ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌నుంచి ఎన్‌క్రిప్టెడ్‌ ఆటోమేటిక్‌ సిగ్నల్‌ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్‌ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్‌ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు