'ప్రజల మనోభావాలను గుర్తించకుండానే విభజన' | Sakshi
Sakshi News home page

'ప్రజల మనోభావాలను గుర్తించకుండానే విభజన'

Published Fri, Aug 16 2013 12:26 PM

'ప్రజల మనోభావాలను గుర్తించకుండానే విభజన' - Sakshi

రాష్ట్ర ప్రజల మనోభావాలు గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి శుక్రవారం కడపలో ఆరోపించారు. అయితే రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత చిచ్చు పెడుతోందని వారు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలకు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మరచిపోలేని శిక్ష వేస్తారన్నారు.  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని చీల్చాలని చూస్తోందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

 

కడపలో సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారానికి ఐదవ రోజుకు చేరింది. జోరువానలోనూ వీరి దీక్ష కొనసాగుతోంది. రాష్ట్రాన్ని చీల్చాలని చూస్తున్న నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.
 

ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి  ఆరోగ్య పరిస్థితిని  వైద్యులు ఈరోజు ఉదయం  పరిక్షించారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసలు శుక్రవారం డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది కానీ రాష్ట్ర విభజన మాత్రం జరగదని ఆయన స్పష్టం చేశారు.

 

ఇక వైఎస్‌ఆర్‌ జిల్లా రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. అమర్‌నాథ్‌రెడ్డి దీక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. వర్షం కారణంగా దీక్షా శిబిరం కుంగిపోయింది. చలి విపరీతంగా ఉన్నా.. మొక్కవోని ధైర్యంతో అమర్‌నాథ్‌రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు.

 

Advertisement
Advertisement