ఆఖరి పోరులో జోరు ఎవరిది?

7 Mar, 2017 12:59 IST|Sakshi

రెండు నెలల క్రితం ఎన్నికల తేదీల ప్రకటనలతో మొదలైన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం బుధవారం ముగుస్తుంది. చివరి, ఏడో దశలో 40 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 27న జరగాల్సిన ఆలాపుర్‌ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో.. ఈ స్థానానికి గురువారం పోలింగ్‌ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రేపు ఎన్నికలు జరగనుండటంతో చివరి దశ ఎన్నికలకు సహజంగానే ప్రాధాన్యం పెరిగింది. ఆరో దశలో మాదిరిగానే చివరి దశలో కూడా ఏడు జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఈ ఏడు జిల్లాల్లో ఐదు.. వారణాశి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలీ, జౌన్‌పూర్‌ భోజ్‌పురీ ప్రాంతంలోనివి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న సోన్‌భద్ర జిల్లా వైశాల్యం పెద్దదే అయినా నాలుగే అసెంబ్లీ సీట్లున్నాయి. బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న ఈ జిల్లాలో బొగ్గు, సున్నపురాయి వంటి సహజ వనరులు ఎక్కువ.  ఈ ఏడు జిల్లాల్లో సీట్ల రీత్యా చిన్న జిల్లా భదోహీ( 3 సీట్లు) కాగా, పెద్దది జౌన్‌పూర్‌(9). కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 40 స్థానాల్లో పాలకపక్షమైన ఎస్పీ అత్యధికంగా 23 గెల్చుకోగా, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఇతర చిన్న పార్టీలు 5 సీట్లు సాధించాయి. ప్రధాని మోదీ, బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్‌ నేతలు మాయావతి, అఖిలేశ్‌ యాదవ్, రాహుల్‌గాంధీ హోరాహోరీగా ప్రచారం చేసిన వారణాశి జిల్లాలో 8 స్థానాలున్నాయి.
 
కులం ప్రభావం ఎక్కువే!

అన్ని విధాలా వెనుకబడిన ఈ ప్రాంతంలో యాదవులు, బ్రాహ్మణులు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ అంశాలే 2012 ఎన్నికల్లో యాదవ పరివార్‌ ఆధిపత్యంలోని ఎస్పీ 20కి పైగా సీట్లు కైవసం చేసుకోవడానికి తోడ్పడ్డాయి. బీసీల్లో అభివృద్ధి సాధించిన, పాలక సామాజిక వర్గాల్లో భాగమైన యాదవులతో సన్నిహిత సంబంధాల్లేని వెనుకబడిన కులాలు రాజభర్లు, పటేళ్లు (కుర్మీలు), కుష్వాహాలు, బిండ్‌లు, ప్రజాపతీలు (కుమ్మరి) బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లతో పాటు ఈ యాదవేతర బీసీల మద్దతు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాలందించింది.  ఆర్థికాభివృద్ధి తక్కువే ఉన్నా విద్యాకేంద్రాలైన అలహాబాద్, వారణాశికి సమీపంలో ఉన్న కారణంగా ఈ జిల్లాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. కొండలు, అడవులతో పాటు సంపన్న వర్గాల దోపిడీ కూడా ఉండడంతో మావోయిస్టులకు మూడు జిల్లాల్లో ప్రాబల్యం ఉంది. మీర్జాపూర్, ఘాజీపూర్, భాదోహీ జిల్లాల్లో ముస్లింలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ తర్వాత మంచి పేరున్న బీజేపీ నేత కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి, ఘాజీపూర్‌ ఎంపీ మనోజ్‌ సిన్హా.

అప్నాదళ్‌తో పొత్తు బీజేపీకి లాభిస్తుందా?

కుర్మీల (పటేళ్లు) పార్టీగా పరిగణించే అప్నాదళ్‌ (సోనేలాల్‌)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పార్టీ నాయకురాలు మీర్జాపూర్‌ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌. ఈ పార్టీ ఈ ప్రాంతంలో 11 సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. అనూ తల్లి కృష్ణ పటేల్‌ నేతృత్వంలోని అప్నాదళ్‌ కూడా యూపీలో 150 సీట్లకు ఒంటరిగా పోటీచేస్తోంది. ఇక్కడి జనాభాలో గణనీయ సంఖ్యలో ఉన్న బీసీల్లో మరో కులం రాజ్‌భర్లకు చెందిన సుహేల్‌దేవ్‌  భారతీయ సమాజ్‌ పార్టీతో కూడా బీజేపీ కలిసి పోటీచేస్తుండడంతో చివరి దశ ఎన్నికల్లో ఈసారి పరిస్థితి కమలానికి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మోదీ విజయాల గురించి జనం చెప్పకుండానే ఆయనకు అనుకూలంగా బహిరంగంగా మాట్లాడడం చాలా గ్రామాల్లో మీడియా ప్రతినిధులను ఆశ్చర్యపరుస్తోంది. అదీగాక దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల మధ్య, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండడంతో కేంద్రంలోని పాలకపక్షం ముందుందనే భావన పరిశీలకుల్లో కలుగుతోంది. ఎస్సీలు, బీసీలు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల మహిళల్లో ఏ పార్టీకి వేయాలనే విషయంలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని బీసీ కులాల మహిళలు మాయావతిపై మొగ్గు చూపుతుండగా, కొన్ని చోట్ల మైనారిటీ మహిళలు ఈ ఒక్కసారి కమలానికి ఓటేసేలా ఉన్నారని జనంతో మాట్లాడిన మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. అతి పెద్ద రాష్ట్రంలో అత్యధిక ప్రజానీకం ఎటువైపు మొగ్గు చూపిందీ శనివారం తేలిపోతుంది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు