‘పవర్‌’ ఫుల్‌.. నీళ్లు నిల్‌..

26 Aug, 2016 01:52 IST|Sakshi
‘పవర్‌’ ఫుల్‌.. నీళ్లు నిల్‌..

9 గంటల సరఫరా కోసం 9,500 మెగావాట్ల విద్యుత్‌ సమీకరణ
ఖరీఫ్‌లో అరకొరగానే పంటల సాగు
భూగర్భ జలాల్లేక విద్యుత్‌ వినియోగించుకోలేని రైతులు
డిమాండ్‌ లేక మిగిలిపోతున్న విద్యుత్‌
12 నుంచి 19 గంటలు సరఫరా
వ్యవసాయానికి పగటిపూట విద్యుత్‌తో రాత్రిళ్లు భారీగా తగ్గుతున్న వినియోగం
విద్యుత్‌ వినియోగంలో  హెచ్చుతగ్గులతో ట్రాన్స్‌కో సతమతం

రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అవుతోంది. కరెంటు ఎప్పుడు వస్తుందా అని అన్నదాత ఎదురుచూడాల్సిన పరిస్థితి నుంచి..రోజుకు 12 నుంచి 19 గంటల విద్యుత్‌ సరఫరా అవుతోంది. గత రబీ వరకు కూడా రాత్రీ పగలు కలిపి 6 గంటల పాటు కరెంటు ఉంటేనే గొప్ప విషయం. అలాంటిది ప్రస్తుత ఖరీఫ్‌లో వ్యవసాయానికి కావాల్సినంత విద్యుత్‌ను సర్కారు సరఫరా చేస్తోంది. ఇందుకోసం ప్రైవేటు సంస్థల నుంచి భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. కానీ రైతాంగం మాత్రం ఐదారు గంటలకు మించి విద్యుత్‌ను వినియోగించుకోలేకపోతోంది. రాష్ట్రంలో పంటల సాగు ఇప్పటికీ ఊపందుకోకపోవడం, మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటడమే దీనికి కారణం.    – సాక్షి, హైదరాబాద్‌

రైతుల ఇబ్బందులు తొలగించేందుకు
గతంలో వ్యవసాయానికి పగలు రాత్రి కలిపి రెండు మూడు విడతల్లో 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా చేసేవారు. అది కూడా కచ్చితమైన సమయాలేమీ ఉండేవి కావు. అలా వేళాపాళా లేని విద్యుత్‌ సరఫరా వల్ల అర్ధరాత్రి పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన చాలా మంది రైతులు విద్యుత్‌ షాక్, పాముకాటు వంటి దుర్ఘటనల బారినపడి మృతి చెందారు. ఈ సమస్యకు పరిష్కారంగా సాగుకు పగటిపూటే 9 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ హామీని ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి అమలు చేసేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

సాగు లేక పెరగని వినియోగం
రాష్ట్రంలో మొత్తంగా 21 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. రాత్రి పగలు రెండు విడతల్లో కలిపి 6 గంటల విద్యుత్‌ సరఫరా చేసినప్పుడు రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ వినియోగం 6,000 మెగావాట్లలోపే నమోదైంది. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచి 9 గంటల సరఫరా విద్యుత్‌ సరఫరా చేస్తే.. వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ గరిష్టంగా 9,500 మెగావాట్లకు పెరుగుతుందని సర్కారు అంచనా వేసింది. ఈ మేరకు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుని అదనపు విద్యుత్ ను సమీకరించింది. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన జూన్‌ నెల నుంచి పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేసినా... వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ అంచనా వేసిన స్థాయిలో పెరగలేదు. ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 40 శాతమే వరి నాట్లు పడడం, ఇతర పంటల సాగు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతోపాటు కొన్నేళ్లుగా నెలకొన్న వర్షాభావం కారణంగా బోర్లలో నీళ్లు లేకపోవడమే వ్యవసాయ విద్యుత్‌ వినియోగం పెరగకపోవడానికి కారణం.

19 గంటలు సరఫరా చేసినా..
రాష్ట్రంలో జూన్‌లో సగటున 6,000 మెగావాట్ల వరకు, జూలైలో సగటున 7,000 మెగావాట్ల వరకు విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. అంటే ప్రభుత్వం సమీకరించిన 9,500 మెగావాట్ల విద్యుత్‌లో 2,000 నుంచి 4,000 మెగావాట్ల వరకు మిగిలిపోతోంది. దీంతో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని బలవంతంగా తగ్గించి బ్యాక్‌డౌన్‌ చేశారు. ఇది సంస్థ ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్‌) 69 శాతానికి పడిపోవడానికి కారణమైంది. ఒకవేళ ప్రైవేటు విద్యుత్‌ను వదులుకుందామనుకున్నా.. ఒప్పందాల ప్రకారం జరిమానాలను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యుత్‌ డిమాండ్‌ను పెంచేందుకు ఆగస్టు నెలారంభంలో  కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాను 9 గంటల నుంచి ఏకంగా 19 గంటలకు పెంచారు. ఆగస్టులో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 6,300–8,000 మెగావాట్ల మధ్య నమోదు కావడానికి ఇది దోహదపడింది. ఈ నెల 12న గరిష్టంగా 7,945 మెగావాట్ల డిమాండ్‌ నమోదయింది. అయితే అందులో హైదరాబాద్‌ నగర విద్యుత్‌ వినియోగమే 2,480 మెగావాట్లు కావడం గమనార్హం.

వచ్చే నెల నుంచి పెరగనున్న డిమాండ్‌
భూగర్భ జలాలు అడుగంటిపోవడం, పంటల సాగు తక్కువగా నమోదవడంతో 19 గంటలు విద్యుత్‌ సరఫరా చేసినా.. రైతులు ఐదారు గంటలకు మించి వినియోగించుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా మెదక్‌ తదితర జిల్లాల్లో వ్యవసాయానికి 12 గంటల నుంచి 15 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్‌లలో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి డిమాండ్‌ 9,500 మెగావాట్లకు చేరుతుందని విద్యుత్‌ శాఖ అంచనా వేస్తోంది. పంటలకు పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా పథకంపై అధ్యయనం కోసమే 19 గంటల పాటు సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఇటీవల పేర్కొన్నారు.

వణుకుతున్న గ్రిడ్‌
పగటి పూటే వ్యవసాయ విద్యుత్‌ వినియోగం జరుగుతుండడంతో ట్రాన్స్‌కోకు గ్రిడ్‌ పరిరక్షణ కత్తి మీద సాముగా మారింది. పగటి పూట ఉన్న డిమాండ్‌లో రాత్రి పూట సగం కూడా ఉండడం లేదు. దీంతో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ డిమాండ్‌లో హెచ్చుతగ్గులకు తగ్గట్లు విద్యుత్‌ సరఫరాను నియంత్రిస్తున్నారు.

మరిన్ని వార్తలు