సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి..

7 May, 2017 20:12 IST|Sakshi
సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి..
- వెంకటరామిరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు
–తన భార్యను వేధిస్తున్నాడని హతమార్చిన దుండగుడు
–నిందితుడు రిజర్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌
–ఆధారాలు బయటపడకుండా మరొకరి హత్య
 
బళ్లారి : బళ్లారి నగరంలోని హవంబావిలో నివాసం ఉంటున్న ఏపీకి చెందిన పుల్లారెడ్డి తనయుడు వెంకటరామిరెడ్డి(42) హత్య కేసును బళ్లారి గ్రామీణ పోలీసులు ఛేదించారు. గత నెల 29న రాత్రి వెంకటరామిరెడ్డిని హత్యచేసి బైక్‌తో సహా తగలబెట్టిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసు మిస్టరీ వారం రోజుల వ్యవధిలోనే బళ్లారి పోలీసులు ఛేదించారు. ఆదివారం సాయంత్రం  జిల్లా ఎస్పీ ఆర్‌.చేతన్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘బళ్లారి నగరంలో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిజర్వు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరెడ్డి, మరొక వ్యక్తి జయరాం అలియాస్‌ అబ్రాలు కలసి వెంకటరామిరెడ్డిని హత్య చేశారు.

ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డి వెంకటరామిరెడ్డికి సమీప బంధువు. బళ్లారిలో వివాహం చేసుకొని అనంతపురంలో రిజర్వ్‌ పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారని తెలిపాడు. శ్రీనివాసరెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో సెక్యూరిటీ బెటాలియన్‌ పోలీసుగా బదిలీ కావడంతో బళ్లారిలో కాపురం పెట్టి విధి నిర్వహణకు హైదరాబాద్‌ వెళ్లి వచ్చేవాడు. శ్రీనివాసరెడ్డి భార్యను వెంకటరామిరెడ్డి తరచూ ఫోన్‌ చేసి వేధించేవాడు. దీంతో పథకం ప్రకారం వెంకటరామిరెడ్డిని శ్రీనివాసరెడ్డి జయరాంతో కలిసి హత్య చేశాడు.’ అని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.
 
సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి మరోవ్యక్తి హత్య
 
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పుట్లూరు చెందిన జయరాంకు, అదే గ్రామానికి చెందిన శేఖర్‌కు మంచి స్నేహం ఉండేది. వెంకటరామిరెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించిన శ్రీనివాసరెడ్డి కొత్త సిమ్‌ కార్డు తీసుకుని రావాలని జయరాంకు సూచించాడు. దీంతో శేఖర్‌కు చెందిన సిమ్‌కార్డు తీసుకుని జయరాం బళ్లారికి వచ్చి శ్రీనివాసరెడ్డికి ఇచ్చాడు. గత నెల 29వ తేదీన ఆ సిమ్‌కార్డుతో వెంకటరామిరెడ్డికి ఫోన్‌ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి, పీకలదాకా మద్యం తాగించి మాటా మాటా పెంచుకుని బీర్‌ బాటిల్‌తో దాడి చేసి హత్య చేశారు.

ఆపై అతని బైక్‌పైనే శవాన్ని ఉంచి తగలబెట్టి పరారయ్యారు. శేఖర్‌ పేరిట నమోదైన సిమ్‌ కార్డు నుంచి వెంకటరామిరెడ్డికి ఫోన్‌ వెళ్లడంతో పోలీసుల విచారణలో నిజాలు వెల్లడవుతాయనే భయంతో సిమ్‌ ఇచ్చిన పాపానికి శేఖర్‌ను కూడా హత్య చేసి సాక్ష్యాలు దొరకకుండా శవాన్ని కాల్చి వేశారు. నిందితుల అరెస్ట్‌తో ఈ రెండు హత్య కేసుల మిస్టరీ వీడింది.
మరిన్ని వార్తలు