అంపైర్ నోబాల్ ఇచ్చాడని.. చెల్లెలికి విషమిచ్చాడు!

31 May, 2016 12:01 IST|Sakshi
అంపైర్ నోబాల్ ఇచ్చాడని.. చెల్లెలికి విషమిచ్చాడు!

క్రికెట్ అంటే మన దేశంలో అందరికీ ఇష్టమే. అయితే అందులో వివాదాలకు కూడా ఏమాత్రం కొదవలేదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలో గల జరారా పట్టణంలో ఇలాగే జరిగిన ఓ వివాదం.. చివరకు విషాదాంతమైంది. అక్కడివాళ్లు ఐపీఎల్ తరహాలోనే జేపీఎల్ అని ఓ టోర్నమెంటు నిర్వహించుకున్నారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 5,100 ఇస్తామన్నారు. జరారా, బరికి జట్ల మధ్య జరుగుతున్న ఓ మ్యాచ్‌లో సందీప్ పాల్ అనే బౌలర్ వేసిన బాల్‌ను అంపైర్ రాజ్‌కుమార్ నోబాల్‌గా ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాల్ కోరాడు. కానీ అంపైర్ తిరస్కరించడంతో, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని చంపేస్తానని బెదిరించాడు.

అయితే, రాజ్‌కుమార్ దాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు. సరిగ్గా మర్నాడే రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులంతా పొలానికి వెళ్లినపుడు సందీప్ పాల్ వాళ్లింటికి వెళ్లి, అక్కడున్న 15 ఏళ్ల పూజకు, ఆమె స్నేహితులు ముగ్గురికి కూల్‌డ్రింకులు ఇచ్చాడు. వాళ్లందరికీ అతడు తెలుసు కాబట్టి అనుమానం ఏమీ రాలేదు. విషం కలిపిన ఆ డ్రింకులను వాళ్లు తాగేశారు. కాసేపటికే పూజ కుప్పకూలింది. దాంతో ఆమెను, మిగిలిన ముగ్గురిని కూడా ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం అలీగఢ్‌లోని పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. సంఘటన స్థలంలోనే మరో పురుగుల మందు సీసా కూడా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు