ప్రపంచంలోనే ఖరీదైన దౌత్య భవనం

22 Sep, 2017 16:13 IST|Sakshi



లండన్‌ :
ఎలాంటి టెర్రరిస్టుల దాడులనైనా తట్టుకొని చెక్కుచెదరకుండా ఉండే విధంగా లండన్‌ నగరంలో అమెరికా తన దౌత్య కార్యాలయాన్ని నిర్మిస్తోంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే కాకుండా అత్యధికంగా డబ్బులు కూడా ఖర్చు చేస్తోంది. వంద కోట్ల డాలర్లతో నిర్మిస్తోన్న ఈ భవనమే ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన అమెరికా దౌత్య భవనం అవుతుందని రాయబార కార్యాలయ వర్గాలు తెలిపారు.

ప్రస్తుతం గ్రాస్‌వీనర్‌లో ఉన్న అమెరికా దౌత్య భవనం చిన్నది అవడం, 1950లో నిర్మించడం వల్ల పురాతనం అవడం వల్ల కొత్త భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లండన్‌లోని అత్యంత ఖరైదైన నైన్‌ ఎల్మ్స్‌ ప్రాంతంలో ఈ కొత్త దౌత్య భవనాన్ని అమెరికా ప్రభుత్వం నిర్మిస్తోంది. అమెరికా దౌత్య కారణంగా తమ భవనాలకు కూడా టెర్రరిస్టుల దాడుల ప్రమాదం ఉంటుందని ఇరుగు, పొరుగు భవనాల యజమానులు ఆరోపించడంతో టెర్రరిస్టు దాడులను నివారించేందుకు వీలుగా ఈ భవనాన్ని డిజైన్‌ చేశారు.

భద్రతలో భాగంగా భవనం చుట్టూ అర్ధ చంద్రాకారంలో నీటి కొలనును ఏర్పాటు చేశారు. భవనంపైనా స్కైపూల్‌ను ఏర్పాటు చేశారు. కింది రిసెప్షన్‌ నుంచి చూస్తే పైన కప్పుగా నీరు, ఆ పైన ఆకాశం కనిపిస్తుంది. పైన నీటిలోకి చూసిన కింది రిసెప్షన్‌ కనిపిస్తోంది. ఈ నీరు కూడా బాంబు దాడులను తట్టుకునే విధంగా ఉపయోగపడుతుందని భవనం ఇంజనీర్లు చెబుతున్నారు. ఎలా అన్నది మాత్రం వారు వివరించలేదు. 2008లో డిజైన్‌చేసి రెండేళ్లుగా కొనసాగుతున్న దీని నిర్మాణం ఈ పాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ కాలేదు. మరెంత కాలం పడుతుందో కూడా ఇంజనీర్లు చెప్పలేకపోతున్నారు. సిబ్బంది కోసం రెస్టారెంట్, క్లబ్‌ హౌజ్‌లను కూడా ఇందులో నిర్మిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు