-

చైనాకు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

24 Jan, 2017 11:23 IST|Sakshi
చైనాకు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

వాషింగ్టన్‌: దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. వివాదాస్పద ఈ సముద్రంలో తమ ప్రయోజనాలను తాము కాపాడుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను 'ఒక దేశం' స్వాధీనం చేసుకోకుండా అడ్డుకుంటామని కూడా తెలిపింది.

'దక్షిణ చైనా సముద్రంలో పలు ప్రాంతాలు అంతర్జాతీయ జలాలు, అంతర్జాతీయ కార్యకలాపాల కిందకు వస్తాయి. అక్కడి మా ప్రయోజనాలను కాపాడుకుంటామని అమెరికా కచ్చితంగా చాటిచెప్పగలదు' అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసెర్‌ తన మొదటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 'దక్షిణ చైనా సముద్రంలోని దీవులు అంతర్జాతీయ జలాలోనివే. అవి చైనాకు చెందినవి కావు. అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను ఒక దేశం స్వాధీనం చేసుకోకుండా మేం అండగా నిలబడతాం అన్నది చాటుతాం' అని స్పైసర్‌ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ జలాల్లో ఉన్న ఈ దీవుల్లోకి చైనా ప్రవేశాన్ని నిరాకరిస్తామని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రిగా ఎంపికైన టెక్స్‌ టిల్లర్సన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు స్పైసర్‌ ఈ విధంగా బదులిచ్చారు. అమెరికా ఉత్పత్తులకు, సేవలకు ఇప్పటికీ చైనానే అతిపెద్ద మార్కెట్‌ అని, అదేవిధంగా చైనా వ్యాపారవేత్తలు, వ్యక్తులకు అమెరికాలో స్వేచ్ఛగా తమ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశముందని చెప్పారు.

మరిన్ని వార్తలు