ఫోన్ కొడితే ఆయుర్వేద వైద్యసేవలు.. వీడియోకాన్ సరికొత్త ఫీచర్

7 Nov, 2013 20:55 IST|Sakshi

సెల్ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రైవేటు టెలికం సంస్థ వీడియోకాన్ ఓ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ఆయుర్వేద వైద్య సేవలను తమ వినియోగదారులకు అందిస్తోంది. ఈ వైద్యసలహాలు, సేవలు పొందాలంటే వినియోగదారులు 535133 నెంబరుకు డయల్ చేయాలి. ఇందుకు నిమిషానికి ఆరు రూపాయల చార్జి అవుతుంది. అలాగే, వినియోగదారులు కావాలనుకుంటే ఇంటికే మందులు కూడా పంపుతారు. ఇందుకు ఇంటి వద్దే డబ్బులు తీసుకుంటారు.

ఈ సేవలు దేశంలోని 1300 నగరాల్లో అందుబాటులో ఉంటాయి. జీవా ఆయుర్వేద గ్రూపు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వినియోగదారులు ఫోన్ చేసినప్పుడు సర్టిఫైడ్ ఆయుర్వేద వైద్య నిపుణులు మాట్లాడి, చికిత్స ఏం తీసుకోవాలో చెబుతారు. కావాలనుకుంటే అప్పుడే వినియోగదారులు మందులను ఆర్డర్ చేయొచ్చు. ఆసియాలోనే అతి పెద్దదైన ఆయుర్వేద టెలి మెడిసిన్ సర్వీసు ద్వారా అందించే ఈ సర్వీసులో 150 మందికి పైగా వైద్యులు అందుబాటులో ఉంటారు. దీనిద్వారా ప్రజలకు వీలైనంత అందుబాటులో వైద్యసేవలు అందించేందుకు వీలుంటుందని వీడియోకాన్ టెలికం డైరెక్టర్, సీఈవో అరవింద్ బాలి తెలిపారు.

మరిన్ని వార్తలు