బీజేపీకి ఓటేస్తే.. చెత్తకుప్పలో వేసినట్టే!

15 Apr, 2017 18:58 IST|Sakshi

కీలకమైన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ’న్యూస్‌18’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసి ఉండకపోతే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం సాధించి ఉండేదని పేర్కొన్నారు. రానున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేస్తే.. చెత్తకుప్పలో వేసినట్టేనని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ హవా సాగుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఢిల్లీ ప్రజలు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఎంసీడీలో బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది. ఈ పదేళ్లకాలంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను అది మూటగట్టుకుంది. బీజేపీ ఎంసీడీ పాలకపక్షం చెత్త నిర్వహణ వల్ల డెంగ్యూ, చికెన్‌ గున్యా వంటి వ్యాధులతోపాటు వీధుల్లో చెత్త బాగా పెరిగిపోయింది. ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదు. అయినా, బీజేపీకి ఓటు వేస్తే అది చెప్పకుప్పలో వేసినట్టే. ఎలాంటి మార్పు ఉండబోదు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయదు. ఢిల్లీ అంతా చెత్త పేరుకుపోతుంది. ఇక, బీజేపీ ప్రధాని మోదీజీ ఫొటోలు ఉపయోగించుకొని ఓట్లు అడుక్కుంటున్నది. మోదీ ఎంసీడీని పాలించబోరు. ఆ పార్టీ అవినీతిపరులు పాలిస్తారు. కాబట్టి మోదీ హవా ఇక్కడ ఉండబోదు’ అని కేజ్రీవాల్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు