తాగునీటి ఎద్దడిపై దృష్టి పెట్టండి

11 Mar, 2016 01:32 IST|Sakshi
తాగునీటి ఎద్దడిపై దృష్టి పెట్టండి

సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలని మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రామీణ తాగునీటి సరఫరాపై జిల్లా అధికార యంత్రాంగం మరింత క్రియాశీలంగా పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కొత్త బోరుబావులపై ఎక్కువ ఖర్చు చేయకుండా పాత బోరుబావులను మరింత లోతుగా తవ్వాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పనితీరుపై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక తీగ (మూడో తీగ)ను ఏర్పాటు చేయాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూళ్లు పెరగాలని... స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే విధంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని పేర్కొన్నారు.
 
100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయండి
పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల ప్రణాళికలను విజయవంతం చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు 11 వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. జూన్ 2 నాటికి ఈ లక్ష్యాన్ని అందుకోవాలని భావించినప్పటికీ ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు మరిన్ని ప్రోత్సాహక నిధులు అందుతాయన్నారు.  

ప్రతి ఇంటికి రెండు 9 వాట్ల బల్బుల చొప్పున ఎంపిక చేసిన 25 పురపాలికల్లో మొత్తం 2.7 లక్షల బల్బులను పంపిణీ చేస్తామన్నారు. ఇక ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్రం పురపాలికలకు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో... ప్రతి మున్సిపాలిటీ, నగర పంచాయతీలో డంప్ యార్డుల ఏర్పాటు కోసం 5 నుంచి 7 ఎకరాల స్థలాన్ని సేకరించి మున్సిపల్ శాఖకు అప్పగించాలని మంత్రి ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు