అమ్మే దిక్కు

27 Feb, 2016 08:31 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జయలలిత

పొత్తుకు డీఎండీకే, పీఎంకేలు దిగిరాకపోవడంతో, ఇక అమ్మ శరణు కోరేందుకు కమలనాథులు సిద్ధమవుతునట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ సీనియర్ నేత ఇలగణేషన్ స్పందించారు. అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలకు అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించడం, ఇందుకు ఢిల్లీ నుంచి పెద్దలు రానుండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
 
* అన్నాడీఎంకేతో పొత్తుకు బీజేపీ ప్రయత్నం   
* ఢిల్లీ నుంచి కమలం పెద్దలు

సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఆ రెండు కూటములకు తామే ప్రత్యామ్నాయం అని అప్పట్లో కమలనాథులు జబ్బలు చరిచారు. ఎన్నికల అనంతరం ఆ కూటమి పటాపంచేలు అయింది. లోక్ సభ ఎన్నికల్లో కమలం గొడుగు నీడన చేరేందుకు ఉరకలు తీసిన వాళ్లు, తాజాగా చీత్కార ధోరణితో ముందుకు సాగుతున్నారు. తమ నేతృత్వంలో ఎలాగైనా కూటమి ఏర్పాటు చేయాలని విశ్వప్రయత్నాల్ని బీజేపీ వర్గాలు చేస్తూ వస్తున్నా ఫలితం శూన్యం.

డీఎండీకే, పీఎంకేలు తమతో కలసి వస్తాయన్న ఆశ ఇన్నాళ్లు కమలనాథుల్లో ఉన్నా, ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లినట్టుంది. ఆ రెండు పార్టీల వ్యవహారం కమలనాథులకు అంతు చిక్కని దృష్ట్యా, ఎక్కడ ఒంటరిగా మిగులుతామోనన్న బెంగ బయలు దేరినట్టుంది. డీఎంకే గొడుగు నీడ కాంగ్రెస్, ప్రజా కూటమిలో వామపక్షాలు ఉన్న దృష్ట్యా, వారితో పొత్తుకు ఆస్కారం లేదు.

పీఎంకే, డీఎండీకేలు మెట్టుదిగని దృష్ట్యా, చివరకు అమ్మే దిక్కు అన్నట్టుగా అన్నాడీఎంకే గొడుగు నీడన చేరడానికి కమలనాథులు కసరత్తులకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి ప్రతినిధులు రానున్నడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేతో కమలం పొత్తు కుదిరేనా అన్న చర్చ బయలు దేరింది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్ శుక్రవారం మీడియాతో స్పందిస్తూ, తమ ప్రయత్నం తాము చేశామని, ఇక ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని వ్యాఖ్యానించడం గమనించాల్సిందే.
 
అమ్మే దిక్కా : తమతో పొత్తుకు ఎవ్వరూ కలిసి రాక పోవడంతో ఒంటరిగా మిగలడం కన్నా, అమ్మ శరణం కోరడం మంచిదన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చినట్టు ప్రచారం బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఇలగణేషన్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్ నేతృత్వంలో ఎన్నికల కమిటీ రంగంలోకి దిగనున్నదని సూచించారు. ఈ కమిటీ చివరి ప్రయత్నంగా డీఎండీకే, పీఎంకేలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ పెద్దల రాకతో రాజకీయంగా మార్పులు, అన్నాడీఎంకేతో పొత్తు విషయంగానూ సంప్రదింపులకు అవకాశం ఉందని స్పందించడంతో ఇక, పాత మిత్రులు కొన్నేళ్ల అనంతరం మళ్లీ ఏకం అయ్యేనా అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. అన్నాడీఎంకే గొడుగు నీడన చేరడానికి ఇక కమలం సిద్ధ పడ్డట్టే అన్న ప్రచారం సాగుతున్నది. జయలలిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోది ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేయడం, తాజాగా అన్నాడీఎంకేతోనూ పొత్తు సంప్రదింపులకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగనున్నడం గమనించాల్సిన విషయం. అయితే, ఏ నిర్ణయాన్ని అయినా, నిర్భయంగా తీసుకునే పురట్చి తలైవి తాజా రాజకీయ పరిస్థితులు, కర్ణాటక అప్పీలు విచారణ వేగం పెరిగిన  నేపథ్యంలో కమలంతో పొత్తు విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు