సౌరశక్తి, ఉప్పు నీరు, కొబ్బరి పొట్టుతో సేద్యం

15 Nov, 2016 03:34 IST|Sakshi
సౌరశక్తి, ఉప్పు నీరు, కొబ్బరి పొట్టుతో సేద్యం

వ్యవసాయానికి అత్యంత ఆవశ్యకమైన  వనరులు.. మట్టి, నీరు, శిలాజ ఇంధనాలు, పురుగుమందులు. ఇవేవీ అవసరం లేని పంటల సాగును ఊహించలేం. కానీ, దక్షిణ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరానికి దగ్గర్లోని ఎడారి ప్రాంతంలో సన్‌డ్రాప్ ఫార్మ్స్‌లో ఇవేవీ అవసరం లేకుండానే టమాటాను సాగుచేస్తున్నారు. సౌరశక్తి సహాయంతో వాణిజ్య స్థాయిలో సాగుతున్న ఈ కృషిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గత ఆరేళ్లుగా పాలు పంచుకుంటోంది.ఈ విధానంలో ముందుగా సముద్ర జలాలను పైపుల ద్వారా శుద్ధి చేసే ప్లాంట్‌కు తరలిస్తారు.

సౌరశక్తితో పనిచేసే ప్లాంట్‌లో ఉప్పు నీటిని శుద్ధి చేస్తారు. సౌర విద్యుదుత్పత్తి కోసం ఈ వ్యవసాయ క్షేత్రం మధ్యలో 23 వేల అద్దాలను అమర్చారు. వీటిపై పడిన సూర్యకాంతిని 115 మీటర్ల ఎత్తున నిర్మించిన టవర్ గ్ర హించి సౌరశక్తి సహాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే 39 మెగావాట్ల విద్యుత్‌ను గ్రీన్‌హౌస్ నిర్వహణకు, సముద్ర జలాన్ని శుద్ధి చేసే ప్లాంట్‌ను నడిపేందుకు వాడుతున్నారు.

వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల బారి నుంచి పంటలను కాపాడేందుకు గ్రీన్‌హౌస్‌ను సముద్రపు నీటితో తడుపుతున్నారు. దీనివల్ల వాతావరణ శుద్ధి జరిగి చీడపీడల నివారణకు రసాయనిక కీటకనాశనులు వాడాల్సిన అవసరం తప్పింది. మొక్కలను పెంచేందుకు మట్టికి బదులు కొబ్బరి పొట్టును వాడారు. శుద్ధి చేసిన సముద్ర జలాలతో 1.80 లక్షల టమాటా మొక్కలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి 17 వేల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేసి ఆస్ట్రేలియాలోని సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

కోస్తా తీరానికి దగ్గర్లో ఉండే ఎడారి ప్రాంతాల్లో లేదా ఇసుక నేలల్లో ఈ విధానంలో హరిత గృహాల్లో పంటలను సాగు చేయవచ్చని ఈ ప్రాజెక్టు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల నిర్వహణకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలకు పెట్టే ఖర్చును ఆదా చేయవచ్చు. పర్యావరణ కాలుష్యాన్నీ తగ్గించవచ్చు. దీని కోసం ప్రారంభంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. చాలా కాలం వరకు పెద్దగా ఖర్చు లేకుండానే దిగుబడులు తీయొచ్చునంటున్నారు.

ఈ విధానాన్ని అనుసరించేందుకు పోర్చుగల్, అమెరికా, ఒమన్, ఖతార్ వంటి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇది చాలా ఉపయోగకరమైన విధానమని, భవిష్యత్‌లో ఆహారోత్పత్తుల దిగుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రోబర్ట్ పార్క్ చెప్పారు.  - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు