ప్రకృతి సేద్యంతో తగ్గనున్న నిరుద్యోగం, రైతులకు అధికంగా ఆదాయం

17 Oct, 2023 10:35 IST|Sakshi

రసాయనిక సేద్యం భూముల్ని బీళ్లుగా మార్చుతుంటే.. ప్రకృతి సేద్యం బీళ్లను సాగులోకి తెస్తుంది. ప్రకృతి సేద్యంతో 2050 నాటికి నిరుద్యోగం రేటు 31 నుంచి 7 శాతానికి తగ్గుతుంది. ప్రకృతి విపత్తులను దీటుగా తట్టుకోవడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. దీనివల్ల రైతుల ఆదాయం అధికం అవుతుంది. 

జనాభా పెరుగుదల– ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి– అసమానతలు, నేల వినియోగం, దిగుబడి –  ఆహార ఉత్పత్తి తదితర  కోణాల్లో రెండు విభిన్న సాగు పద్ధతుల్లో పొందే ఫలితాల్లో వ్యత్యాసాలను అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందుపరిచారు.


రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యవసాయం ఇలాగే కొనసాగితే 2050 నాటికి రైతుల సంఖ్య సగానికి తగ్గుతుంది. నిరుద్యోగం రేటు 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గుతుంది. అయితే, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేపడితే రైతుల సంఖ్య కోటికి పెరుగుతుంది. నిరుద్యోగం రేటు 7 శాతానికి తగ్గుతుంది. 

► ప్రకృతి వ్యవసాయం ద్వారా బంజరు భూములు కూడా సాగులోకి వస్తాయి. అధిక విస్తీర్ణం సాగులోకి వచ్చి అత్యధిక మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా రసాయన రహిత సురక్షిత పంటలు పండిస్తారు. అందువల్ల అధిక మార్కెట్‌ ధర పొందుతారు.
 
► ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలు, నీటి వినియోగం, రసాయనాలు, ఇంధనం, అప్పులు, భారీ యంత్ర సామగ్రి తదితర ఖర్చుల విషయంలో రైతులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది.  ఈ రైతులు పంట ఉత్పత్తులను విలువ జోడించి అమ్ముతారు కాబట్టి అధికాదాయం వస్తుంది. 

► ప్రకృతి వ్యవసాయంలో నిరుద్యోగం తగ్గి, వ్యవసాయ–వ్యవసాయేతర వేతనాల్లో అంతరం తగ్గటం కారణంగా ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆర్థిక వృద్ధి 6.5%కి చేరుకుంటుంది.  

► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2050 నాటికి ఇది 6.1 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు ఉత్పత్తి చేసిన ప్రతి కిలో కేలరీల ఆహారానికి 10.3 పైసల ఆదాయం పొందుతారు. 

► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి విస్తీర్ణం 2050 నాటికి 55 లక్షల హెక్టార్లకు తగ్గుతుంది. కొన్ని పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించే పారిశ్రామిక వ్యవసాయ విధానంలో బీడు భూముల విస్తీర్ణం 2019లో 24 లక్షల హెక్టార్ల నుంచి 2050 నాటికి 30 లక్షల హెక్టార్లకు పెరిగే ప్రమాదం ఉంది. 

► ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బీడు భూములు కూడా సాగులోకి వచ్చి 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి 2050 నాటికి 80 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది. పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రస్తుత సవాళ్లను అధిగమించవచ్చు.  

► రసాయన సేద్యంలో మొత్తం మీద తక్కువ భూమి, తక్కువ మంది రైతులు, అధిక సాగు ఖర్చులు, అధిక నిరుద్యోగ రేటుతో కలిపి వ్యవసాయ జివిఎ పెరుగుదల రేటు సగటున సంవత్సరానికి 4% నుంచి 3.5%కి తగ్గుతుంది. 

► ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని పెంపొందించి సారవంతమైన భూములను అందిస్తుంది. అనేక రకాల పంటలతో అధిక పంట సాంద్రత ఏర్పడుతుంది. 

► ప్రకృతి వ్యవసాయం అనుసరిస్తున్న రైతులు దిగుబడిలో ఎలాంటి తగ్గుదల లేకపోవడమే కాకుండా, అధిక దిగుబడిని కూడా సాధిస్తున్నారు. వర్షాధార వ్యవసాయ భూముల్లోనూ పలు రకాల పంటల సాంద్రత వల్ల మరింత దిగుబడిని సాధిస్తున్నారు. మొత్తానికి ప్రకృతి వ్యవసాయంలో రైతులు 2019లో హెక్టారుకు రోజుకు 31,000 కిలో కేలరీల ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. 2050 నాటికి అది 36,000 కిలో కేలరీలకు పెరుగుతుంది. 

► రసాయనిక వ్యవసాయంలో 2050 నాటికి రైతులు రోజుకు హెక్టార్‌కు దాదాపు 44,000 కిలో కేలరీలు ఉత్పత్తి చేసినా.. ప్రకృతి సేద్యంలో పండే పంట ఉత్పత్తులు  స్థూల,సూక్ష్మ పోషకాలు, పీచు పదార్ధంతో కూడిన బలవర్ధకమైన, సమతుల్యమైన  ఆహారాన్ని అందిస్తాయి.   

► రెండు విభిన్న పద్ధతుల్లో ఆహారోత్పత్తి, సాగు విస్తీర్ణం, వార్షిక దిగుబడులను అంచనా వేసి చూస్తే.. 2050లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే ఆహారం రసాయనిక వ్యవసాయం (4050 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో కంటే ప్రకృతి వ్యవసాయం (5000 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో గణనీయంగా పెరుగుతుంది. అంతేగాక  ప్రకృతి సేద్యంలో పండించిన పంట ఉత్పత్తులు రసాయనిక ఉత్పత్తుల కంటే మరింత సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 

► ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనే విధంగా వ్యవసాయ పంటల జీవ వైవిధ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం నేలల్లో వృద్ధి చెందుతుంది. తద్వారా వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.  

► అధిక ఉష్ణోగ్రతలు, కరువు, తుపాన్లు, వరదలు వంటి వాతావరణ విపత్తులను తట్టుకోవడం రసాయనిక సేద్యంతో సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేస్తోంది. పెట్టుబడి తగ్గటం, సురక్షిత నీటితో పాటు విస్తృత స్థాయిలో ΄ûష్టికాహారం అందించడం, పర్యావరణ పరిరక్షణ వల్ల రాష్ట్రం ‘రైతు అభివృద్ధి’కి దిక్సూచిగా మారుతుంది.  

మరిన్ని వార్తలు