Importance Of Natural Farming: మూడేళ్ల పాటు రీసెర్చ్‌.. ప్రకృతి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతుంది

17 Oct, 2023 10:20 IST|Sakshi

జలమే జీవం జలమే ఆహారం.. అనే  నినాదంతో ఎఫ్‌ఎఓ ప్రపంచ ఆహార దినోత్సవం సోమవారం నిర్వహించింది. ఈ సందర్భంగా వెలువడిన ఓ తాజా నివేదిక ఆసక్తిని కలిగిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2031 నాటికి పొలాలన్నిటినీ పూర్తిగా ప్రకృతి సేద్యంలోకి మార్చాలన్నది సంకల్పం. అయితే, ప్రకృతి వ్యవసాయ ప్రభావం 2050 నాటికి ఎలా ఉంటుంది? రసాయనిక వ్యవసాయంలో కొనసాగితే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ అంశాలను లోతుగా శోధిస్తూ క్షేత్రస్థాయి ప్రకృతి సేద్య ఫలితాల ఆధారంగా ‘ఆగ్రోఎకో 2050 ఫోర్‌సైట్‌ ప్రాజెక్టు’లో భాగంగా మూడేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం చేశారు. 

ఫ్రెంచ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్మెంట్‌ (సిఐఆర్‌ఎడి)కు చెందిన సీనియర్‌ ఆర్థికవేత్త బ్రూనో డోరిన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) వ్యవసాయ శాస్త్రవేత్త అన్నే సోఫి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ టి. విజయకుమార్‌ పలువురు శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి 2019 నుంచి 2022 వరకు అధ్యయనం చేశారు. అంతర్జాతీయ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నివేదికను రూపొందించటం విశేషం.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించిన తదనంతరం ‘ఆగ్రోఎకో 2050: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార వ్యవస్థలపై పునరాలోచన– ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తులో ఆహార సమృద్ధిని ఎలా సాధిస్తుంది’ అనే శీర్షికన అధ్యయన నివేదిక సిద్ధమైంది. నీతి అయోగ్‌ సభ్యులు (వ్యవసాయం) ప్రొఫెసర్‌ రమేశ్‌ చంద్‌ దీన్ని న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేశారు. పారిశ్రామిక (రసాయనిక) వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని పోల్చుతూ రెండు విభిన్న పరిస్థితుల్లో 2050 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసాయం, ఆహారం, పర్యావరణం, ఉపాధి, సంక్షేమం తదితర రంగాల్లో ఎలా ఉండబోతోంది అనే విషయంపై విశ్లేషణను ఈ నివేదిక వెల్లడిస్తోంది.

రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం సరికొత్త ఆహార వ్యవస్థల స్థాపనలో ఎలాంటి అవకాశాలను కలిగిస్తుంది అనే కోణంలో శోధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి 7 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2031 నాటికి ఈ రైతుల సంఖ్య 60 లక్షలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆర్థిక, పర్యావరణ, పోషకాహార, సామాజిక సవాళ్లను సమీకృత పద్ధతిలో పరిష్కరించే హరిత వ్యవసాయానికి ఏపీ రాష్ట్రం నాయకత్వం వహిస్తుందనేది అధ్యయన బృందం అభిప్రాయం.  

‘ప్రకృతి’ నేర్పుతున్న అసాధారణ నీటి పాఠాలు!
ప్రకృతి వ్యవసాయం సాగు నీటి వినియోగ పద్ధతిని సమూలంగా మార్చివేస్తుంది. ప్రకృతి సేద్యంలో సాగయ్యే పంటలు నీటిని వినియోగించుకోవటం మాత్రమే కాదు, నీటిని ఉత్పత్తి చేసుకుంటాయి కూడా! నదుల్లో ఉండే నీటికి పది రెట్లు నీరు గాలిలో ఉంది. గాలి నుంచి నీటిని సంగ్రహించి ఉపయోగించుకోవడం ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యమవుతుంది. 365 రోజులు ఆకుపచ్చగా పంటలతో పొలాన్ని కప్పి ఉంచటం, అవశేషాలతో ఆచ్ఛాదన కల్పించటం వల్ల నేలలో నుంచి తేమ ఆవిరి కావటం తగ్గుతుంది.

నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి నీటిని గాలి నుంచి గ్రహించి పట్టి ఉంచుకునే శక్తి ఈ పంటలకు సమకూరుతోంది. కురిసిన 100 చుక్కల్లో 50 చుక్కలు వాగుల్లోకి పోతున్నాయి లేదా ఆవిరవుతున్నాయి. ప్రకృతి సేద్యంలో ఈ నష్టం బాగా తగ్గి, భూమిలోకి నీరు ఎక్కువగా ఇంకుతుంది.నీటిని భౌతికశాస్త్ర కోణం నుంచి అర్థం చేసుకోవటమే ఇప్పటి వరకు చేశాం. ప్రకృతి వ్యవసాయం జీవశాస్త్ర కోణం నుంచి నీటిని చూడటం నేర్పుతోంది. ఈ అసాధారణ పాఠాలు మేం నేర్చుకుంటూ సరికొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నాం.

వర్షం కురవక ముందే విత్తనాలను గుళికలుగా మార్చి విత్తుతున్నాం. నెల తర్వాత కొద్దిపాటి జల్లులు పడినా పంటలు మొలకెత్తుతున్నాయి. ఒకటికి పది పంటలు వత్తుగా వేయటం వల్ల రైతులకు చాలా లాభాలు చేకూరుతున్నాయి. బంజరు భూములను దున్నే పని లేకుండా సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పాదులు చేస్తూ ఒక్కో పాదులో ఐదారు రకాల విత్తనాలు వేస్తూ బంజరు భూములను సైతం రైతులు సాగులోకి తెస్తున్నారు. మన రైతుల అనుభవాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
– టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ

మరిన్ని వార్తలు