దేశీ రాగులుంటే దిగులుండదు!

11 Jul, 2017 01:18 IST|Sakshi
దేశీ రాగులుంటే దిగులుండదు!

అంతరించిపోతున్న దేశీ రాగి(తైదలు) వంగడాలను ప్రత్యేక శ్రద్ధతో సాగు  చేస్తున్నారు కర్ణాటక రైతు సోమశేఖర. అనాదిగా మన రైతులు సాగు చేస్తున్న  చిరుధాన్యపు పంట రాగి. దిగుబడి తక్కువగా ఉండటంతో రైతులు వీటి సాగుకు స్వస్తిపలికి ఆహార, వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. అప్పులతో ఆత్మహత్యల పాలైన వారూ ఉన్నారు. కానీ దేశవాళీ రాగి వంగడాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే రైతు జీవితానికి కనీస భద్రత ఉంటుందంటున్నారు సోమశేఖర. వరుస కరువులను తట్టుకొని, వేసవిలో కూడా మంచి దిగుబడినిచ్చే రకాలున్నాయని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

కర్ణాటకలోని మాండ్యా జిల్లా శివల్లి గ్రామానికి  చెందిన సోమశేఖర అనే రైతు అనేక దేశీ రాగి రకాలను సాగు చేస్తూ, వాటిని సంరక్షిస్తున్నారు. ఒకప్పుడు మాండ్యా ప్రాంతంలోనూ రైతులు దేశీ రాగి రకాలను విరివిగా సాగు చేసేవారు. నీటి పారుదల సౌకర్యం వచ్చాక ఏటా చెరకు,  రెండు పంటలు వరిని సాగు చేస్తున్నారు. గడచిన రెండేళ్లుగా కరవు ఉండటంతో 275 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రెండో పంటగా రబీలో మాత్రం రాగులు సాగు చేస్తున్నారు. అయితే సంకరజాతి రకాల వల్ల దేశీ రాగి వంగడాల మనుగడ ప్రశ్నార్థకమయింది.

ఈ పరిస్థితుల్లో రైతుల నేతృత్వంలో నడిచే ‘సహజ సమృద్ధ’ అనే సంస్థ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రైతుల నుంచి 40 కు పైగా దేశీ రాగి రకాలను సేకరించింది. ఈ సంస్థ ద్వారా దేశీ వంగడాల ప్రాముఖ్యతను తెలుసుకున్న సోమశేఖర వాటి పరిరక్షణకు నడుం బిగించారు. ఎడాగు రాగి, శరావతి రాగి, రాగల్లి శివల్లి రాగి, బోండా రాగి, కెంపు రాగి, బిలిగడ్డ రాగి, బెన్నెముద్దె రాగి, మరియు హసిరి కడ్డి రాగి వంటి 30 రకాల దేశవాళి రాగి రకాలను ఆయన సాగు చేస్తున్నారు. వీటిలో కొన్ని స్వల్పకాలిక రకాలు, మరికొన్ని పశుగ్రాసం కోసం సాగు చేసే రకాలు. ఇలా ప్రతి దేశీ రాగి రకానికి తమవైన లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి.

సోమశేఖర తొలుత నర్సరీ బెడ్‌లపై నారు పోస్తాడు. 25 రోజుల తరువాత మొక్కలను పొలంలో నాటుకుంటాడు. పశువుల ఎరువు మాత్రమే వాడతాడు. మొక్కలు నాటుకున్నప్పుడు, నెల రోజుల దశలో, పశువుల ఎరువు వేసినప్పుడు, పూతకొచ్చినప్పుడు... ఇలా పంటకాలం మొత్తంలోనూ నాలుగు సార్లు మాత్రమే నీటి తడులు ఇస్తాడు. అయినా మంచి దిగుబడులు వస్తున్నాయని సోమశేఖర తెలిపారు.

దేశీ రాగి రకాలను సాగు చేస్తే దిగుబడి తక్కువ వస్తుందని కొంతమంది రైతులు భావిస్తున్నారని, ఇది అపోహ మాత్రమే అంటారాయన. ‘జగలూరు రాగి’ రకాన్ని కరువు కాలంలోనూ, వేసవిలోనూ సాగుచేసి తాను మంచి దిగుబడులు పొందుతున్నానని.. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చే దేశీ రాగి రకాలున్నాయని ఆయన చెప్పారు. సోమశేఖర స్ఫూర్తితో ఇప్పుడు ఇరుగు పొరుగు రైతులు దేశీ రాగి వంగడాలను సాగు చేస్తున్నారు.
 
‘అయ్యన రాగి అనే దేశీ రకం గురించి మా నాయన చెపుతుంటే వినటం తప్పించి మేం ఎన్నడూ చూసింది లేదు. కానీ అలాంటి అంతరించిపోతున్న రకాలను సాగు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని సోమశేఖర భార్య మణి సంతోషంగా చెపుతున్నారు. ఒక్కో రైతు ఒక్క దేశీ రాగి రకాన్ని సాగు చే సినా దేశీ రాగి రకాలను పది కాలాలు పదిలంగా కాపాడుకోవచ్చని సోమశేఖర సాటి రైతులకు సూచిస్తున్నారు. 

సేంద్రియ సాగుకు అనువైనది ‘జగలూరు రాగి’
కర్ణాటక – ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోని చిత్రదుర్గ జిల్లాలోని చిన్న పట్టణం జగలూరు. ఈ ప్రాంతంలో చిరకాలం నుంచి సాగులో ఉంది కాబట్టి  ‘జగలూరు రాగి’ రకంగా ప్రసిద్ధి పొందింది. పెద్ద కంకులు, ఎక్కువ పిలకలు, ఎత్తుగా పెరగడం, సాగు నీటి సదుపాయం ఉన్నా, వర్షాధారంగానైనా అధిక దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత. జగలూరు రాగుల రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. వినియోగదారులు ఇష్టపడుతుండటంతో మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంది. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తే 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. దీని సాగు కాలం 4 నెలలు. సేంద్రియ సేద్యానికి ఇది బాగా అనువైన వంగడమని బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సేంద్రియ వ్యవసాయ సంస్థ రైతులకు సిఫారసు చేసిందని బెంగళూరుకు చెందిన  ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సహజ సమృద్ధ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.

(దేశీ రాగి, చిరుధాన్యాల విత్తనాలు కావలసిన రైతులు మైసూరులోని సహజ సీడ్స్‌ సంస్థను 099640 31758, 95351 49520 నంబర్లలో లే దా ఈ–మెయిల్‌ sahajaseeds@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.)

మరిన్ని వార్తలు