సేంద్రియ ‘స్ఫూర్తి’ వనం!

10 Jan, 2017 03:48 IST|Sakshi
సేంద్రియ ‘స్ఫూర్తి’ వనం!

► నాలుగు ఎకరాల్లో ఎన్నో రకాల పంటలు ∙
పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు
►పండ్ల మొక్కలు.. పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలు..
►జీవవైవిధ్యం వెల్లివిరుస్తున్న శౌరిరెడ్డి వ్యవసాయ క్షేత్రం


స్ఫూర్తి వనం... నాలుగున్నర ఎకరాల విస్తీర్ణం. నాలుగేళ్ల క్రితం అంతా బీడు. ఇప్పుడు అంతా పచ్చదనం. సుమారు 50 జాతుల పండ్ల మొక్కలు.. వాటి మధ్యన పప్పు దినుసుల పంటలు.. కనువిందు చేస్తున్నాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో కాదు. గ్రేటర్‌ వరంగల్‌ నగర పరిధిలో. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడెంలో ఉంది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింగారెడ్డి శౌరిరెడ్డి నాలుగేళ్ల కృషితో స్ఫూర్తి వనం అభివృద్ధి చెందుతోంది.

పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఈ తోట సాగవుతోంది. సేంద్రియ సాగు ఆవశ్యకతపై రైతులను ఒప్పించడానికి ‘స్ఫూర్తి వనం’ బాగా ఉపయోగపడుతున్నది. ఈ సేంద్రియ ప్రదర్శన క్షేత్రం గురించి శౌరిరెడ్డి మాటల్లోనే..

నాలుగేళ్ల క్రితం బాల వికాస స్వచ్ఛంద సంస్థ తరపున సేంద్రియ సాగు విస్తరణ కార్యక్రమాలు నిర్వహించే వాళ్లం. గ్రామాల్లో రైతుల సమావేశాలు నిర్వహించి.. సేంద్రియ సాగుతో కలిగే ఉపయోగాలను తెలియజేసేవాళ్లం. సేంద్రియ సాగులో దిగుబడుల గురించి చెప్పే సందర్భాల్లో చాలా మంది రైతులు నమ్మలేకపోయే వాళ్లు. అలాంటి సందర్భాల్లో రైతుల చూపులు మమ్మల్ని ప్రశ్నించినట్లుగా ఉండేవి. రైతులకు సేంద్రియ సాగు గురించి చెప్పే ముందు స్వయంగా ఆచరించి చూపితే ఈ సమస్య తీరుతుందని భావించాం. ఆ క్రమంలోనే ‘స్ఫూర్తి వనం’ ఆలోచన పుట్టింది. మొదట మనం సేంద్రియ పంటలు పండించి చూపితే ఎక్కువ మంది రైతులకు నమ్మకం కుదురుతుందని అనిపించింది.

మాది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. ఇప్పటి తరం పిల్లల మాదిరిగా నా కూతురు స్ఫూర్తి... ‘వరి చెట్లు’ అంటే నా పరువు పోయినట్లే. అందుకే.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, పిల్లలకు వ్యవసాయాన్ని గురించి తెలియజెప్పడానికి నా కూతురు ‘స్ఫూర్తి’ పేరుతో సేంద్రియ సాగు మొదలుపెట్టా. వీలు చిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్తుంటా. ప్రతి వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి స్ఫూర్తి వనానికి వెళ్తా. అక్కడి వాతావరణంలో ఉండే అనుభూతి ఎక్కడా ఉండదు. సేంద్రియ సాగు ఆవశ్యకతపై రైతులను ఒప్పించడానికి స్ఫూర్తి వనంలో సాగు పద్ధతులు బాగా ఉపయోగపడుతున్నాయి.

వంద జాతులు లక్ష్యం..
స్ఫూర్తి వనాన్ని ఆదర్శవంతమైన సేంద్రియ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే 100 జాతుల పండ్ల మొక్కలు నాటాలనుకుంటున్నా. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విభిన్న జాతుల పండ్ల మొక్కలు తెప్పిస్తున్నా. ప్రస్తుతం 49 రకాల పండ్ల మొక్కలు నాటాను. మరో 33 రకాల పండ్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. నాటిన పండ్ల మొక్కల్లోనూ వేర్వేరు రకాలున్నాయి. కేవలం మామిడిలోనే 16 రకాల మొక్కలున్నాయి. నాలుగు రకాల జామ, మూడు రకాల సపోట, మూడు రకాల చెర్రీ ఉన్నాయి. సీతాఫలాల జాతికి చెందిన రామాఫలం, లక్ష్మణఫలం, సీతాఫలం, హనుమాన్‌ ఫలం ఉన్నాయి. అరటి, ద్రాక్ష, జీడిపప్పు, సీమచింత, కొబ్బరి, నిమ్మ, బత్తాయి, నారింజ, దానిమ్మ, చింత, పుచ్చ, అనాస, బొప్పాయి,  స్టార్, లిచ్చి, మిరకిల్‌ ఫ్రూట్, ఇండియన్‌ ఫిగ్, ఫాషన్‌ , డ్రాగన్, అమ్లా, ఆపిల్, ఆపిల్‌ బేర్, అవకాడో, బేల్, బెంతామెస్‌కార్నెల్, డెటెల్‌నట్, బిగ్నె, బిలిమ్‌బి, బ్రీడ్, జాక్, కొకుమ్, లొంగాన్, నోని, ఓలి, పీర్, ప్లమ్స్, పమ్మేలో, జుబుటికబ, సైసమ్, సాండల్, వెట్టి, గర్చిన, మూటి, బరబ, లోవిలోవి వంటి రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఖర్జూర, ఇప్ప, తాటి చెట్లు ఉన్నాయి.

మొదట తెచ్చిన మొక్క తెచ్చినట్లు నాటుతూ పోయా. తర్వాత ఓ విషయం గమనించా. చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఏ మొక్క ఏ సీజనులో పూత, కాత వస్తోందో గమనిస్తున్నా. సీజన్ల వారీగా పండ్లు వచ్చే మొక్కలను గుర్తించి వేరు చేస్తున్నా. వేసవి కాలంలో పండ్లు వచ్చే మొక్కలన్నీ ఒక చోట, శీతాకాలంలో కాసే మొక్కలన్నీ ఒకచోట నాటుతున్నా. దీని వల్ల సాగు సులభమవుతోంది.

మిశ్రమ పంటలతో మేలు...
బాల వికాస స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో రైతులను ఎక్కువగా కలుస్తుంటాం. ఎక్కువ మంది రైతులు... ‘కష్టపడి సాగు చేశా. పంట బాగా పండింది. ధర తక్కువగా ఉండడంతో అనుకున్నట్లు ఆదాయం రాలేదు’ అని చెబుతుంటారు. సాగు భూమిలో మొత్తం ఒకే పంట వేయకుండా మిశ్రమ పంటలు వేస్తే లాభం ఉంటుంది. ముఖ్యంగా రైతు కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీరతాయి. మా స్ఫూర్తి వనంలో వేరుశనగ, పెసర, కందులు, శనగలు, మినుములు పంటలు వేశాను. మా ఇంటి అవసరాలు తీరుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వరి పండించాను. గత ఏడాది కరువుతో బోరులో నీరు లేక నాట్లు వేయలేదు.

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సాగు కుంట(ఫామ్‌ పాండ్‌) నిర్మిస్తున్నా. కూరగాయలు సాగు చేస్తున్నా. టమాటాలు కాస్తున్నాయి. తీగ జాతి కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నా. వ్యవసాయానికి ఆధారమైన రెండు ఆవులు ఉన్నాయి. జీవామృతం, ఘన జీవామృతం, కషాయాలు తయారు చేసి వాడుతున్నాం. సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారోత్పత్తులను మిత్రులకు, బంధువులకు పంపించినప్పుడు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్‌

మరిన్ని వార్తలు