డోనాల్డ్ ట్రంప్ రాయని డైరీ

10 Jan, 2016 01:25 IST|Sakshi
డోనాల్డ్ ట్రంప్ రాయని డైరీ

పట్టే చోటే నిద్రపోవాలి. పట్టున్న చోటే నిలబడాలి. క్యాంపైన్‌లో నేను కనుక్కున్న జీవిత సత్యాలివి. ట్రంప్ టవర్ అపార్ట్‌మెంట్‌లోని నా బెడ్‌రూమ్‌లో తప్ప అమెరికాలో ఇంకెక్కడా నాకు నిద్ర పట్టడంలేదు. అందుకే రోజంతా ఎక్కడ తిరిగినా రాత్రికంతా న్యూయార్క్ వచ్చేస్తున్నాను. అది నా క్యాంపెయిన్ మేనేజర్‌కి నచ్చడం లేదు. ‘ఇలాగైతే కష్టం ట్రంప్’ అంటున్నాడు! ‘ఏమిటి కష్టం?’ అన్నాను సోఫాలో నడుం వాలుస్తూ. ‘టెడ్ క్రూజ్ మనకన్నా ముందున్నాడు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నాడు. జనం ఏది పెడితే అది తింటున్నాడు. పీజా ప్లేస్, కాఫీ హౌస్, వాటర్ పార్క్ అన్నీ తిరిగేస్తున్నాడు’ అన్నాడు. ‘మనమూ తిరుగుతూనే ఉన్నాం కదా.. మిస్టర్ లెవాన్‌డోస్కీ’ అన్నాను నీరసంగా.

‘వాళ్ల మధ్య తిరిగినంత మాత్రాన ఓట్లు పడవు ట్రంప్. వాళ్ల మధ్య నిద్రపోవాలి. వాళ్ల దుప్పటి లాక్కుని కప్పుకోవాలి. వాళ్ల తలగడ పైనే మన తలా ఆన్చాలి. నిద్ర మధ్యలో వాళ్లను లేపి మంచి నీళ్లు అడుగుతుండాలి. కనీసం ఒక్కసారైనా చిటికెన వేలు చూపిస్తూ బాత్రూమ్ వరకూ తోడు రమ్మనాలి. అప్పుడే వాళ్లు మిమ్మల్ని తమ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు’ అన్నాడు లెవాన్‌డోస్కీ. ‘ఇంకా’ అన్నాను చికాగ్గా. ‘సోఫాలో వాలిపోయి ఇలా చీజ్ బర్గర్ తింటూ టీవీ చూడ్డం మానేయాలి’ అన్నాడు.

లెవాన్‌డోస్కీ ఏమంటున్నాడో అర్థం కావడం లేదు! తిండి మానేస్తే ప్రసంగాలు ఎలా ఇవ్వడం? టీవీ చూడ్డం మానేస్తే ప్రసంగాలు ఎలా చూడ్డం? ‘రేపు మాట్లాడుకుందాం మిస్టర్ లెవాన్‌డోస్కీ. గుడ్ నైట్’ అని చెప్పి అతడిని పంపించేశాను. ఇక్కడే ఉండనిస్తే నా నిద్ర, నా తిండి పాడుచేసేలా ఉన్నాడు. నా మూడ్ కూడా పాడయ్యేలా ఉంది. మెల్లిగా బెడ్ మీదకు చేరుకున్నాను. ఒత్తుగా, సుఖంగా ఉంది. అయోవా, న్యూహాంప్‌షైర్‌లలోని బడ్జెట్ హోటళ్లలో ఇంత సుఖం, ఇంత శుభ్రం ఎక్కడుంటుంది?! ‘ముందుగా ఎలక్షన్స్ జరిగేది ఆ రెండు రాష్ట్రాల్లోనే కాబట్టి అక్కడి వాళ్లను ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలి ట్రంప్’ అంటాడు మా మేనేజర్. ఇంప్రెస్ చెయ్యడం కోసం ఆ దిక్కుమాలిన మిస్సోరీ లాడ్జీలకు వెళ్లి, పొడవాటి తల వెంట్రుకలు కనిపించే బ్లాంకెట్స్‌పై పడుకుంటామా?! ది గ్రేట్ రియల్ ఎస్టేట్ మొగల్‌కి అంత కర్మేమిటి? ఐ హావ్ మై ఓన్ బెడ్.

నిద్రపట్టే ప్లేస్ అయితే తెలిసింది కానీ, నన్ను నిలబెట్టే పార్టీ ఏదో తెలియడం లేదు. డెమోక్రాట్‌గా పోటీ చేయాల్సింది! అక్కడైతే హిల్లరీ, ఇంకో ఇద్దరు. అంతే. రిపబ్లికన్ పార్టీలో నాకు పదకొండు మంది పోటీ! అంతా గవర్నర్లు, సెనెటర్లు. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవారు. ఓట్ల కోసం నిజంగా వీళ్లు పడే పాట్లు చూస్తూంటే.. రాజకీయాల మీద, ఆఖరికి ఒబామా మీద కూడా నాకు గౌరవం పెరిగిపోతోంది!

మరిన్ని వార్తలు