ఆరాధన వెనుక ఆరోగ్యం

20 Jul, 2017 02:53 IST|Sakshi
ఆరాధన వెనుక ఆరోగ్యం

కొత్త కోణం

తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ పేరుతో ఉన్న గ్రామదేవతల వృత్తాంతం కూడా ఇటు వంటిదే. అంబిగయి అమ్మన్‌కూ, పోచమ్మకు పోలికలున్నాయి.  ప్రాంతానికి చెందిన అంబిగయి అమ్మన్‌ లాగానే పోచమ్మ కూడా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు ఎన్నో చిట్కాలను అందించింది. అక్కడ ఏ విధమైన ఆరోగ్య సూత్రాలను అంబిగయి ప్రచారం చేసిందో అటువంటి పద్ధతులనే పోచమ్మ కూడా ఇక్కడి ప్రజలకు చెప్పిన వాస్తవం పంబాల, బైండ్ల కళాకారులు చెప్పే కథల్లో నిక్షిప్తమై ఉన్నది.

తొలకరికి పల్లెల్లో పరుచుకునే పచ్చదనానికి తోడు ప్రతి ఇంట్లోని పసుపు పచ్చదనం కూడా తోడవుతుంది. గ్రామ దేవతల జాతరలు, కొలుపులు, బోనాలు, వన భోజనాల్లాంటి ఊరంతా ఉమ్మడిగా జరుపుకునే ఉత్సవాలతో పల్లెలు కళకళలాడతాయి. ఆషాఢ, శ్రావణ మాసాల్లో పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా జనం జాతరల్లో ఓలలాడుతుంటారు. ఈ ఉత్సవాల్లో కచ్చితంగా కనిపించే పదార్థాలు పసుపు, కుంకుమ, వేపమండలు. ముగ్గుల రూపంలోనో, ఇతరత్రా పద్ధతుల్లో సున్నం కూడా వాడుతుంటారు. కానీ ఇలాంటి ఉత్సవాలన్నీ, కొలుపులన్నీ ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే, వర్షాలు ఆరంభం అయ్యే రోజుల్లోనే జరుగుతాయి.

ఈ సంప్రదాయంలో కొంత మూఢ నమ్మకం ఉంటే ఉండొచ్చు కానీ ఒక నమ్మకం కూడా ఉన్నది. గ్రామదేవతలను కొలిస్తే ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారనుకోవడం విశ్వా సమే. అయినా, దాని వెనుకనున్న శాస్త్రీయతను తెలుసుకునే యత్నం కూడా చేయాలి. ఇలాంటి ఆచారాలు ఆరంభం కావడానికి వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం ఏమిటో చరిత్ర మనకు అందిస్తుంది. కానీ ఇటువంటి పరిశోధనలు తక్కువ. తమిళనాడులో మాత్రం ఇటువంటి ఆవిష్కరణలు జరిగాయి. అవి మన సామాజిక దృక్పథాన్ని మార్చివేసే అవకాశముంది.

గ్రామదేవతల ఆరాధన వెనుక...
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు పూర్వం, 19వ శతాబ్దం అర్థభాగంలో అయోతీదాస్‌ అనే దళిత తాత్వికవేత్త భారత సామాజిక, సాంస్కృతిక చరిత్రను భౌతికవాద దృష్టితో అధ్యయనం చేశారు. ఆయన పరిశోధనతోనే అంతుపట్టని గ్రామ దేవతల చరిత్ర ఈరోజు మనందరికి అవగాహనకు వచ్చింది. పింగళి నిఘంటువు, జీవగ చింతామణి పుస్తకాల ఆధారంగా దాస్‌ చెప్పిన విషయాలు^è రిత్రను శాస్త్రీయ దృష్టితో పరిశీలించే అవకాశం ఇచ్చాయి. క్రీ.శ. ఒకటవ శతాబ్దంలో తమిళనాడులో నాగపట్నం ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ గా«థను దాస్‌ ఉటంకించారు. అక్కడి ఒక గ్రామంలో పేద కుటుం  బంలో జన్మించిన అంబిగయి అమ్మన్‌ బాల్యంలోనే చదువు నేర్చుకున్నది. అప్పటికే ఆ ప్రాంతంలో బౌద్ధం ప్రాచుర్యంలో ఉంది. అందువల్లనే చదువు మీద ఆంక్షలు లేవు. పదమూడేళ్లకే బుద్ధుని బోధనలు అర్థం చేసుకున్నది. తండ్రి పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే అమ్మన్‌ తిరస్కరించి, బౌద్ధం ప్రచారానికే జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పింది. కూతురు బౌద్ధ భిక్కునిగా మారడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కానీ ఆమె పట్టుదల ముందు ఓడిపోయాడు. కొద్ది కాలంలోనే బుద్ధుని బోధనలూ, బౌద్ధ సర్వస్వం త్రిపిటకాలూ అమ్మన్‌ క్షుణ్ణంగా చదివింది.

అందుకే ఆమెను పిటకారి, పిటారి, పిడారి అని కూడా పిలిచేవారు. పిటక– అరిని వేరు చేసి చూస్తే పిటక బౌద్ధ సాహిత్యం, అరి అంటే జ్ఞాని అని అర్థం. ఆమె వేపచెట్టు కింద ధ్యానం చేస్తుండేది. కానీ ఒక్క ధ్యానమే కాదు, నిత్యం ప్రజలతో కలిసిపోయేది. వారి మంచి చెడ్డలను తెలుసుకునేది. తనకు తెలిసిన విషయాలను వాళ్ళకు వివరించేది. బుద్ధుని బోధనలను అర్థమయ్యే భాషలో బోధిస్తూనే, ప్రజల ఆర్థిక, సామాజిక సమస్యలను, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను చర్చిస్తూండేది. ఆ సమయంలో వర్షాలు లేక కరువు ఏర్పడింది. ఆకలి, అనారోగ్యం అతలాకుతలం చేశాయి. అనారోగ్యం పోయి, సుఖంగా ఉండాలంటే త్రిశుద్ధిని పాటించాలని కోరింది. మనస్సు, ఇల్లు, గ్రామం శుభ్రంగా ఉంచుకోవడమే దాని సారాంశం.

పరిశుభ్రమైన పరిసరాలలో దైవం
మనసులో ఉన్న క్రోధాన్ని, ద్వేషాన్ని, అసూయలను తొలగించుకోవాలని, ప్రేమను పెంచుకొని, పదిమందికీ పంచాలని కోరింది. ఇంటిని శుభ్రంగా ఉంచుకునే అంశం మీద కొన్ని పద్ధతులను ప్రత్యేకంగా బోధించింది. ముందుగా ఇల్లును ఎర్రమన్నుతో అలకాలనీ, వాకిలిలో పేడతో అలుకు చల్లాలనీ, సుద్దతో ముగ్గువేయాలని, గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలని చెప్పింది. రోగాల బారిన పడినవారు తమ ఇళ్ల గుమ్మాలకు వేపాకు మండలు తోరణాలుగా కట్టాలని కూడా ఆదేశించింది. ఎవరికైనా శరీరంలో పొక్కులు (మశూచి, పోచమ్మ, ఆటలమ్మ లాంటివి) వస్తే వారి మంచం నిండా వేపాకులు పక్కవేసినట్టు పరిచి ఉంచాలని కూడా ఆమె చెప్పేది. స్త్రీలు స్నానం చేసే సమయంలో శరీరం నిండా పసుపును రాసుకోవాలని, మగవారైతే పసుపును నుదుటి మీద రాసుకోవాలని ఆమె ప్రచారం చేసింది. అన్నంలో, కూరల్లో పసుపు వేసుకోవాలని అమ్మన్‌ ప్రచారం చేసింది. ఈ పద్ధతులతో అంటువ్యా«ధులు క్రమంగా తగ్గిపోయాయి. ఒకటి రెండు సంవత్సరాల్లో ఆ ఊరు రూపురేఖలు మారిపోయాయి. ఆమె మాటలు, చేతలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కొంతకాలం తర్వాత ధ్యానంలోనే అంబిగయి నిర్వాణం పొందారు.

అంబిగయి అమ్మన్‌ శరీరాన్ని దహనం చేసి, ఆ బూడిదను వవేరీనదిలో కలిపారు. ఆ నీటిలో లక్షలాది మంది స్నానాలు చేశారు. అట్లా స్నానం చేసిన రోజునే ప్రతిఏటా నాగపట్నం ప్రాంతంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఆషాఢమాసంలో జరుగుతుండడం విశేషం. ఇప్పటికీ ఆమెను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారనడానికి ఈ జాతరే ఉదాహరణ. అయితే అంబిగయి అమ్మన్‌ సేవలు, ఆమె గొప్పతనాన్ని తెలుసుకున్న ఎందరో బౌద్ధాచార్యులు తక్షశిల, నలందాల నుంచి ఆమెను సందర్శించడానికి వచ్చేవారు. ఆమె సాగించిన కృషి దేశమంతటా వ్యాప్తి చెందింది. అయితే నాగపట్నంలో ఆమె పేరుతో ఉన్న విగ్రహాన్ని పోర్చుగీసువారు తొలగించి, ఆ స్థానంలో మేరీమాత విగ్రహాన్ని పెట్టారు. 2005వ సంవత్సరంలో వచ్చిన సునామీలో ఆ విగ్రహం కూడా సముద్రంలో కలిసిపోయింది.

పోచమ్మ, అంబిగయి– కొన్ని సారూప్యాలు
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందీ, అన్వయించుకోవాల్సిందీ ఒకటుంది. సరిగ్గా ఇటువంటి సాంస్కృతిక జీవనమే మనకు కూడా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ పేరుతో ఉన్న గ్రామదేవతల వృత్తాంతం కూడా ఇటువంటిదే. అంబిగయి అమ్మన్‌కూ, పోచమ్మకు పోలికలున్నాయి. అంబిగయి అమ్మన్‌ లాగానే పోచమ్మ కూడా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు ఎన్నో చిట్కాలను అందించింది. నాగపట్నంలో ఏ విధమైన ఆరోగ్య సూత్రాలను అంబిగయి ప్రచారం చేసిందో అటువంటి పద్ధతులనే పోచమ్మ కూడా ప్రజలకు చెప్పిన వాస్తవం పంబాల, బైండ్ల కళాకారులు చెప్పే కథల్లో నిక్షిప్తమై ఉన్నది. పోచమ్మతో పాటు, మైసమ్మ, పోలేరమ్మ, మల్లమ్మ, అంకమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ– ఏడుగురు అక్కాచెల్లెళ్లుగా చెప్పే మౌఖిక సంప్రదాయ కథలు తెలంగాణలో నేటికీ ప్రచారంలో ఉన్నాయి. వీళ్లందరూ శివుని బిడ్డలుగా కూడా కథలు, గాథలు చెబుతూ ఉంటాయి. పోచమ్మ ఆరాధన మాత్రం పూర్తిగా ఆరోగ్య సమస్యలు, పరిరక్షణతో ముడిపడి ఉంది. అందుకే మన తెలుగు ప్రాంతంలో కూడా ఆషాఢమాసంలో బోనాలు, జాతరలు, పండుగలు చేస్తుంటారు. ఇందులో కూడా ప్రధానంగా వేపాకు, పసుపు, పసుపు అన్నంతో కూడిన బోనం పెడుతుంటారు.

గ్రామదేవతలంతా బౌద్ధంలోని వారే
అటు అంబిగయి అమ్మన్, ఇటు పోచమ్మ కూడా ఇద్దరూ బౌద్ధ భిక్కునిలేనని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంబిగయి అమ్మన్‌ జీవిత కథను ఆయోతీదాస్‌ సంపూర్ణంగా తన పరిశోధనలో బయటపెట్టారు. అయితే తెలుగునేల మీద ఉన్న గ్రామదేవతలు కూడా బౌద్ధ సంప్రదాయానికి చెందినవారుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామ దేవతలను ఇటీవలి కాలం వరకు హిందూమతం తనలో భాగంగా చూడలేదు. వారిని క్షుద్రదేవతలని, వారి ఆరాధనను మాలమాదిగల పూజలనీ తిరస్కరించారు. అందుకనే గ్రామ దేవతల కొలుపులకు పంబాల, బైండ్ల వాళ్లే పూజారులుగా ఉంటారు. ఇప్పటికీ వాళ్లే కొలుపు చేస్తుంటారు. అయితే గత ఇరవై, ముప్ఫయ్‌ సంవత్సరాల నుంచి ఈ గ్రామదేవతలపేరుతో గుళ్లు కట్టించడం మొదలైంది. కానీ అంతకు ముందు అవి కేవలం రాళ్లూ, రప్పలూ కొయ్యబొమ్మలే. ఎప్పుడైతే గుళ్లు నిర్మాణమై, ఆదాయం రావడం మొదలైందో, అక్కడ మళ్లీ బ్రాహ్మణ పూజారులు చేరారు. వాటిని కూడా హైందవీకరించే ప్రయత్నం జరుగుతున్నది. ఏది ఏమైనా ఈ గ్రామదేవతలు పూర్తిగా హైందవ సంప్రదాయానికి వెలుపల ఉన్నవారే. హిందూత్వానికి వ్యతిరేకంగా వచ్చి, శాస్త్రీయంగా నిలిచిన బౌద్ధాన్ని నమ్మిన వాళ్లే.

క్రీస్తుశకం ఒకటవ శతాబ్దం తరువాత బౌద్ధంపై హైందవ మతదాడులు పెరిగాయి. అందులో భాగంగానే వేలాది మంది బౌద్ధులను చంపేయడం లేదా పారిపోయేటట్టు చేయడమే జరిగింది. జ్యోతీరావుఫూలే తన ‘గులాం గిరీ’ పుస్తకంలో విష్ణువు దశావతారాలను స్థానిక ప్రజలపై ఆర్యులు జరిపిన పది దాడులుగా పేర్కొన్నారు. అందులో పరశురాముడు ఒకరు. ఆ పరశురాముడు బ్రాహ్మణ, క్షత్రియ వైరంలో అనేక మంది క్షత్రియులను హతమార్చినట్టు చెబుతారు. ఈ క్షత్రియులంతా బౌద్ధులేననేది ఫూలే వాదన. అందులో భాగంగానే పరశురాముడి వల్ల ఎల్లమ్మను హతమార్చడం, తల్లి మల్లమ్మను చంపడానికి ప్రయత్నించిన పరశురాముడిని తప్పించుకొని మాదిగవారి ఇంటిలో తోలును శుభ్రం చేసే లందలో తలదాచుకుంటుంది. తల్లి జాడను చెప్పినందుకు మాదిగ ఇంటి మహిళను తల నరుకుతాడు. ఒక రకంగా అపభ్రంశమైన కథ. ఎందుకంటే, ఎల్లమ్మ పరశురాముడి తల్లి అయితే చంపే అవకాశమే లేదు. కావాలనే దానిని ఆ విధంగా ఒక కథగా సృష్టించారు. ఎల్లమ్మ కూడా ఒక శక్తివంతమైన బౌద్ధ భిక్కునియే. ఎందుకంటే, ఆమె తలదాచుకున్నది మాదిగ ఇంట్లో, అంటే అప్పటికే మాదిగ, మాలలు అంతా వైదికమతానికి బయట ఉన్నారు. అందువల్ల ఎల్లమ్మతో పాటు, అడ్డం వచ్చిన వాళ్లను పరుశురాముడు చంపేస్తాడు.

గ్రామదేవతల పూజలకు సంబంధించి శాస్త్రీయత ఉన్నదని చెప్పే చారి త్రక ఆధారం ఉన్నది. అవి కాలక్రమేణా మూఢనమ్మకాలుగా పరిణమించి, జంతుబలులు, రకరకాల పూజల పేరుతో తçప్పు దోవపట్టాయి. కానీ క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాడు అంబిగయి అమ్మన్‌ అందించిన ఆరోగ్య పద్ధతులు చూపించిన జీవన విధానం కనీసం ఏదో ఓ రూపంలో ఆచరణలో ఉన్నాయి. భారత సమాజ పురోగమనానికి, ముఖ్యంగా మానవాళి రక్షణకు బౌద్ధ భిక్కునిలు చేసిన కృషి చరిత్ర మరువలేనిది.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213  


మల్లెపల్లి లక్ష్మయ్య

మరిన్ని వార్తలు