‘కింగ్’ సర్కస్‌లో అంతా జోకర్లే

12 Mar, 2016 00:15 IST|Sakshi
‘కింగ్’ సర్కస్‌లో అంతా జోకర్లే

జాతిహితం
మాల్యా కథంటే ఆశ్రీతవాదాన్ని మనం అతి తేలికగా కావలించుకున్న కథ. మాల్యా ఉత్థాన పతనాలలో పార్లమెంటు, అధికార యంత్రాంగం, మీడియా, బ్యాంకులు అన్నీ భాగస్వా ములే. రక్షణాత్మక విధానాలతో మనం శక్తివంతుల మధ్య శాశ్వత అనుబంధాన్ని ఏర్పరచాం. దుర్బలమైన మన ‘సర్కారు’ను పూర్తిగా సంతృప్తి పరచగల జేబులు మన వ్యాపారవేత్తలలో చాలా మందికి ఉన్నాయి. అది కొంత ఇప్పుడు మారుతోంది. మాల్యాకు నచ్చినా నచ్చకపోయనా, ఉపయోగకరమైన ఈ మార్పునకు మీడియా దోహదపడుతోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2006-11 మధ్య చైర్మన్‌గా పని చేసిన ఏపీ భట్ మహా చురుకైన పట్టుదలగల అధికారి. పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆధునిక రూపాన్నిచ్చే యత్నాలు తారస్థాయికి చేరిన 2010 మొదట్లో ఆయన, తమ సరికొత్త సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణ సందర్భంగా దృశ్యశ్రవణ ప్రదర్శనా కార్యక్రమాన్ని  ఏర్పాటు చేశారు. ఆయన దాన్ని ఆ ఏడాదికే అతి పెద్ద కార్పొరేట్ పార్టీని చెయ్యాలనుకు న్నారు. అందుకోసం ముంబైలోని బ్రబూన్ స్టేడియంను అద్దెకు తీసుకున్నారు. వ్యాపార రంగంలోని పేరున్న పెద్దలందరినీ ఆహ్వా నించారు. వారంతా వచ్చారు కూడా. భట్ స్వయంగా అతిథులలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. వారిలో (ఈ రచయితా ఉన్నాడు). లేజర్లతో ఆయన తన ప్రజంటేషన్‌ను ప్రారంభించారు. స్టేడియంలోని లైట్లన్నీ ఆర్పేశారు. గుండ్రటి టేబుళ్ల ముందు ఆశీనులైన అతిథులంతా ఆ ప్రద ర్శనను చూస్తూ హర్షధ్వానాలు చేస్తున్నారు. అంతలో ఎడమ వైపు నుంచి అందరి దృష్టిని మరల్చేలా కలకలం రేగింది.

మాల్యా శక్తి అంతటిది మరి!
పరావర్తనం చెందిన లేజర్ వెలుగులలో అతి ముఖ్యుల్లా కనిపించే ఓ డజను మంది కనిపించారు. విజయ్ మాల్యా! ఓ ఇంట్లోకైనా, పార్టీకైనా, మరెక్కడికైనా... ఆశ్రీత, అంగరక్షక, పరివ్రాజక, భృత్యు సమేతుడై ప్రవేశించడం విజయ్ మాల్యా (వీజేఎమ్) విశిష్ట ఆగమన శైలి. ఆయన సేవక బృందంలోని వారంతా కండలు తిరిగి, పొడవుగా, ముదురు రంగు సూట్లు ధరించి ఆయన అధికారం వెలుగులతో జిగేల్‌మంటుండేవారు. భట్ ఆ ప్రజంటేషన్‌ను నిలిపివేసి లైట్లు వేయ మని చెప్పడానికి ఆ బృందపు సమష్టి ప్రకాశం ఒక్కటే సరిపోయింది. ప్రదర్శనను నిలిపేసిన వారెవరో అంతా గ్రహించడంతో ఈర్ష్యా భావం తోనూ, ప్రశంసాపూర్వకంగానూ గుసగుసలు మొదలయ్యాయి. ‘‘బాస్, నువ్వేమైనా చెప్పు, అయితే వీజేఎమ్ లాంటి రుణగ్రహీత కావాలి. తన అతి పెద్ద రుణదాత కార్యక్రమానికి విఘాతం కలిగించే శక్తి అతనికి ఉంది. అయినా ఆయన్ను గౌరవంగా చూస్తున్నారు’’ అని నా టేబుల్ వద్ద కూచున్న ఒక వ్యాపార ప్రముఖులు అన్నారు. మాల్యా శక్తి అలాంటిది.

2010 నాటికే ఆయన నష్టాల్లో, అప్పుల్లో పడ్డారని గుర్తుచేసుకోండి. 2008 నాటి ప్రోత్సాహక ప్యాకేజీల కాలం 2010లో కూడా కొనసాగుతోందని కూడా గుర్తుచేసుకోండి. అప్పట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండి ద్రవ్యత్వం సమృద్ధిగా ఉండేది.  చమురు ధరలు పెరగడం కూడా అప్పుడే మొదలైంది. అయినా ఆయన ఆశను అదుపులో ఉంచగలిగేదేదీ లేదు. ఆయనకు అప్పు ఇచ్చిన ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుకైనా అతన్ని హెచ్చరించే ధైర్యం ఉన్నదంటే నమ్మలేను. వాళ్లంతా అతనిచ్చే పార్టీలకు ఆహ్వానాలను అందుకోవాలని ఉవ్వి ళ్లూరుతుండేవారు. మళ్లీమళ్లీ  అప్పులు చేసేవాడే అయినా అతగాడు బ్యాం కర్లకు అత్యంత విలువైన విజయ చిహ్నం అయ్యాడు. అతగాడు ఎగవేతదారు అయ్యే అవకాశం ఉన్నదని బ్యాలన్స్ షీట్ల నిండా రాసి కనిపిస్తున్నా అతగాడి వైభవం మాత్రం అలాగే వెలిగింది.

ఇది, ‘‘డాక్టర్’’ (గౌరవ) విజయ్ మాల్యా జీవితంలోని, ఆ కాలానికి సంబంధించిన సూక్ష్మ పరిశీలన కాదు. ఆ వ్యాపార ఒప్పందాలు, విలీనాలు, ప్రతి విలీనాల వ్యవహారాన్ని విడమరచగల నైపుణ్యం నాకు లేదు. ఆయన అడుగులకు మడుగులొత్తిన బ్యాంకులు ఆయన సృజనాత్మకతను ఎన్నడైనా సందేహించాయేమోననే అనుమానమూ నాకు లేదు. ఉదాహరణకు, 2007- 08లో మాల్యా ఎందుకూ కొరగాని డక్కన్ ఎయిర్‌లైన్స్‌ను రూ. 2,100 కోట్లకు కొనేశాడు. దాన్ని కింగ్‌ఫిషర్‌తో ‘‘మెర్జ్’’ (విలీనం) చేశాడు. విదేశాలకు వైమా నిక సర్వీసులను నడపాలంటే కనీసం ఆ సంస్థ ఐదేళ్లయినా విమానాలు నడుపుతుండాలనే పౌర విమానయాన శాఖ వారి అసలుసిసలైన మూర్ఖపు నిబంధనను తప్పుకుపోవడానికే మాల్యా ఇదంతా చేశారని ప్రతి ఒక్కరికీ తెలుసు. కింగ్‌ఫిషర్, 2005లోనే విమాన సర్వీసులను ప్రారంభించింది.  కాబట్టి విదేశాలకు విమానాలను నడిపే హక్కు కోసం మాల్యా, డక్కన్‌ను కొని, తన విమాన సంస్థలో విలీనం చేశారు, చాలా సృజనాత్మకమైన ఆలోచన అని మీరనొచ్చు, అధికార యంత్రాంగపు నియంత్రణాపరమైన అసమర్థతను ఎత్తిచూపడానికి అతగాడు చూపిన యుక్తిని, హాస్యస్ఫూర్తిని మీరు ప్రశంసిం చవచ్చు. కానీ ఇందు కోసం మీరాయనకు అప్పు ఇచ్చేస్తారా?

‘గౌరవనీయులు’ పార్లమెంట్ సభ్యులు
ఒక్కసారి మీరే బ్యాంకర్ల స్థానంలో, ప్రత్యేకించి ప్రభుత్వరంగ బ్యాంకర్ల స్థానంలో నిలిచి చూడండి, మాల్యా కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, పార్లమెంటులోని ప్రముఖ సభ్యుడు కూడా. వాజ్‌పేయి ఎన్‌డీఏ నుంచి మన్మోహన్‌సింగ్ యూపీఏ వరకు చాలా మంది క్యాబినెట్ మంత్రులతో ఆయనకు మొదటి పేరుతో సంబంధించుకునేంత చనువుండేది. రెండవ దఫా ఎంపీగా ఆయన కీలకమైన పలు సంప్రదింపుల కమిటీల్లో సభ్యులుగా ఉండే వారు. పౌర విమానయానం, ఫెర్టిలైజర్లు కూడా వాటిలో ఉండటంలో ఆశ్చర్య మేమీ లేదు (మాల్యాకు సొంతంగా మంగళూరు పెట్రోకెమికల్, ఫెర్టిలైజర్ వ్యాపారం ఉంది). ఈ ప్రయోజనాల స్పర్థను భారత పార్లమెంటే పట్టించు కోకపోతే, అతి ఆశావహ దృష్టితో వ్యవహరించినందుకు పాపం ఆ బ్యాం కర్లను తప్పు పట్టడం ఎందుకు? మాల్యా ఇచ్చే పార్టీలకు, ఐపీఎల్ మ్యాచ్ లతో సహా అతను నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకోవాలని వారు పోటీలుపడేవారు. అలాంటి సందర్భాలలో మాల్యా దేశంలోని అత్యంత శక్తివంతులు, సుప్రసిద్ధులు, సినిమా స్టార్ల నుంచి మోడల్స్, రాజ కీయవేత్తలు, అగ్రస్థాయి పాత్రికేయులు, మీడియా కుబేరులతో భుజాలు భుజాలు రాసుకు తిరిగేవారు.

మాల్యాకు అప్పివ్వడమంటే బ్యాంకర్లకు అధి కారం, గ్లామర్ సీమలలో తిరగడానికి సీజన్ టికెట్టనే అర్థం. మాల్యా తమ వద్ద అప్పు తీసుకోవడమంటే వారికి మేలు చేయడం లాంటిది. భారత వైమా నిక రంగం పతనోన్ముఖంగా ఉన్నదని ప్రతి ఒక్కరూ రోగ నిర్ధారణ చేస్తున్న నాటి పరిస్థితి ఇది. జెట్ ఎయిర్‌వేస్ కూడా మార్కెట్లో వాటా కోసం కామకాజీ (ఆత్మహత్యా సదృశమైన) పోరాటం సాగిస్తూ, డక్కన్ స్థాయిలో నిరర్థకమైనదైన సహారాను రూ. 2,000 కోట్లు అప్పు చేసి తెచ్చిన డబ్బుతో సొంతం చేసుకుంది. తను కొన్న డక్కన్‌తో కింగ్ ఫిషర్‌కు ఊపిరి సలపకుండా పోయింది. జెట్ ఎయిర్‌వేస్‌కు కూడా చావు తప్పి కన్ను లొట్టపోయింది. అయితే ఆ సంస్థ ప్రమోటర్‌కు మాల్యాకు లేని ఒక లక్షణం ఉంది. ‘‘నేను అంతా గందరగోళం’’ చేశాను అని చెప్పగల అంతులేని వినయం, శక్తి ఉన్నాయి. అవే గనుక లేకపోతే మీరు ఇతరుల డబ్బును అప్పుగా లేదా ఈక్విటీగా ఎప్పుడూ తీసుకోరాదు.

‘గ్లామర్’ కథలో కీలకమైనవి కాంటాక్టులే
 మాల్యా కథంటే ఆశ్రీతవాదాన్ని మనం అతి తేలికగా కావలించు కోవడానికి  సంబంధించిన కథ. పార్లమెంటు, అధికార యంత్రాంగం, మీడియా, బ్యాంకులు అన్నీ కేవలం మాల్యా ఉత్థాన పతనాలలోనే కాదు, ఇతరులు చాలా మంది విషయంలో కూడా వాటిలో భాగస్వా ములే. సోషలిస్టు రక్షణాత్మక విధానం పేరిట మనం శక్తివంతుల మధ్య శాశ్వత అనుబంధాన్ని ఏర్పరచాం. అక్కడ లెక్కలోకి వచ్చేవి కాంటా క్టులు, నెట్‌వర్క్‌లే తప్ప బ్యాలన్స్ షీట్లు కావు. దుర్బలమైన మన ‘సర్కారు’ను పూర్తిగా సంతృప్తి పరచగలిగేటంత పెద్ద జేబులు మన సంప్రదాయక వ్యాపారవేత్తలలో చాలా మందికి ఉన్నాయి. అది కొంత ఇప్పుడు మారుతోంది. మాల్యాకు నచ్చినా నచ్చకపోయనా, ఉపయోగ కరమైన ఈ మార్పుకు మీడియా దోహద పడుతోంది.  

సంస్కరణల అనంతర కాలపు భారత్‌లో బ్యాంకులు ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. గతంలో 2002-03లో ఇలాంటి సంక్షోభం వచ్చింది. అప్పుడు నేను సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద గ్రేట్ బ్యాంక్ రాబరీ శీర్షికతో పరిశోధనాత్మక వ్యాసాల పరం పరను ప్రారంభించింది. 30కి పైగా భాగాలుగా ప్రచురితమైన ఆ కథనాల్లో కనిపించిన పేర్లు చాలా నేడు కూడా ‘‘సుప్రసిద్ధుల జాబితా’’లోనే ఉన్నాయి. బాలీవుడ్‌లోని ఖాన్‌లలాగా మన బోర్లాపడ్డ రుణగ్రహీతలు కూడా ఎవర్‌గ్రీన్ హీరోలే. నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ కథనాలు ఆందోళన కలిగించాయి. మేం మరీ అతిగా చేస్తున్నామని ‘‘బాగా  పైవాళ్ల’’ నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద మనిషే స్వయంగా నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంకా ఎంత సుదీర్ఘంగా నడుపుతారీ వరుస కథనాలను, మొత్తం ఏడాదంతానా’’ అని అడిగారు. నేను ‘‘లేదు అటల్జీ, మా జాబితాలోకి ఎక్కడానికి కనీసార్హత రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అప్పు చెల్లించకపోవడం. కాబట్టి ఇంకా కొన్ని కథనాలే వస్త్తాయంతే’’ అని నేను చెప్పాను.

‘‘మరైతే మీరు బాలూ జీని ఎందుకు చేర్చారు? అతను బకాయిపడ్డది 35 కోట్లేగా?’’ అని ఆయన అడిగారు. ‘‘ఆయన ఎంపీ, మంత్రి కాబట్టి ఆయన ఇంకా తక్కువకే అర్హులయ్యారు. ఇలాంటి కేసులలో ఎంపీలకు గీత తక్కువగా ఉండాలి కదా’’ నేను నా పద్ధతిలో మందలించాను. డీఎంకేకు చెందిన టీఆర్ బాలు ఎన్‌డీఏ కాబినెట్‌లో ఉన్నారు, ఆయన ఖాయిలా పడ్డ వ్యాపారం బ్యాంకులు రూ. 35 కోట్లు రుణం తిరిగి చెల్లించలేదు.

ఇప్పుడు మనకు 17 ప్రభుత్వ బ్యాంకులకు రూ. 9,000 కోట్ల అప్పు ఎగ్గొట్టిన గౌరవనీయులైన ఎంపీ ఉన్నారు. లండన్ నుంచి ట్విటర్లో ఆయన ఇప్పుడు మనతో తృణీకార భావంతో మాట్లాడతారు.
http://img.sakshi.net/images/cms/2015-08/81438371243_295x200.jpg
 twitter@shekargupta
 శేఖర్ గుప్తా

 

మరిన్ని వార్తలు