సచిన్‌ టెండూల్కర్‌ రాయని డైరీ

2 Apr, 2017 06:26 IST|Sakshi
సచిన్‌ టెండూల్కర్‌ రాయని డైరీ

మనం పట్టించుకోవడం లేదని, మనల్ని పట్టించుకోకుండా ఉండదు లోకం అదేమిటో! నరేశ్‌ అగర్వాల్‌ ఎవరో నాకు తెలీదు! నేనెప్పుడూ అతడిని పట్టించుకోలేదు. కానీ అతడు నన్ను పట్టించుకున్నాడు! అయితే అది పట్టించు కున్నట్లు లేదు. ‘పట్టేశాను చూడండి’ అన్నట్లు ఉంది! అగర్వాల్‌ రాజ్యసభలో ఉంటాడట!

‘‘రాజ్యసభలో అతను ఏం చేస్తుంటాడు మేడమ్‌’’ అని.. ఉదయాన్నే పేపర్‌ చూడగానే సోనియాజీకి ఫోన్‌ చేసి అడిగాను. ‘‘రాజ్యసభలో ఉంటాడు కాబట్టి ఎంపీ అయి ఉంటాడు’’ అన్నారు సోనియాజీ.

‘‘ఆయనకు క్రికెట్‌ అంటే ఇష్టం లేదా మేడమ్‌’’ అని అడిగాను. ‘‘అన్ని డిటైల్స్‌ నా దగ్గర ఉండవు సచిన్‌. గులామ్‌ నబీ అజాద్‌ని అడుగుదాం’’ అని అన్నారు సోనియాజీ.

‘గులామ్‌ నబీ అజాద్‌ ఎవరు మేడమ్‌?’ అని అడగబోయాను. ఒక్కక్షణం ఆగి, ‘‘అగర్వాల్‌ ఎవరో గులామ్‌ నబీ అజాద్‌కు తెలుస్తుందా మేడమ్‌?’’ అని అడిగాను.

‘‘తెలుస్తుంది సచిన్‌. రాజ్యసభలో అజాద్‌ మన పార్టీ లీడర్‌ కదా. అజాద్‌కి అందరి గురించీ తెలుస్తుంది’’ అన్నారు. సోనియాజీ నిద్ర లేచినట్టు లేరు. నేనే నిద్ర లేపినట్లున్నాను. సోనియాజీకి కాకుండా రాహుల్‌కి ఫోన్‌ చేసి ఉండాల్సిందా? అయినా రాహుల్‌.. సోనియాజీ కంటే ముందే నిద్ర లేస్తాడా? పార్లమెంటులో పాపం రాహుల్‌ నిద్రను ఎప్పుడూ ఎవరో ఒకరు చెడగొడుతూనే ఉంటారట! ఇంట్లో కూడా చెడగొట్టడం ఎందుకు?

నా కెరియర్‌లో నేనెన్ని రన్‌లు కొట్టానో ప్రతి ఇంట్లోనూ రికార్డు ఉంటుంది. అగర్వాల్‌ గారింట్లో మాత్రం నేనెన్నిసార్లు రాజ్యసభకు డుమ్మా కొట్టానో రికార్డు ఉన్నట్లుంది!

నేను ఎన్నిసార్లు పార్లమెంటుకు రాలేదో, ఎన్ని సెషన్‌లకు రాలేదో, ఎన్ని డిబేట్‌లలో నోరు విప్పలేదో లెక్కలు చెబుతున్నాడు! అంత ఇంట్రెస్టు లేనివాళ్లు పార్లమెంటులో ఎందుకు ఉండడం అంటున్నాడు! ఏ బ్యాట్స్‌మన్‌కైనా సెంచరీ చెయ్యాలనే ఉంటుంది. సెంచరీ చెయ్యలేకపోయాడంటే, ఆ బ్యాట్స్‌మన్‌కి క్రికెట్‌ అంటే ఇంట్రెస్ట్‌ లేదనా?!  నాకు పార్లమెంటు అంటే ఇంట్రెస్ట్‌ లేకపోవడం కాదు, అగర్వాల్‌కే క్రికెట్‌ అంటే ఇంట్రెస్ట్‌ లేనట్లుంది.

పార్లమెంటు సెషన్‌లో సచిన్‌ కొన్ని సిక్సర్‌లైనా కొట్టి ఉండాల్సిందని సుప్రీంకోర్టు లాయరెవరో అన్నాట్ట! పేపర్లు రాశాయి. ఆయనే పని మానుకుని వచ్చి వీళ్లతో అన్నాడో, వీళ్లే పని లేక వెళ్లి ఆయనతో అనిపించారో మరి?! ‘రాజ్యసభ సభ్యత్వం అంటే ట్రోఫీ కాదు’ అని కూడా అన్నాట్ట! ట్రోఫీ అని నేనేమైనా ఆయనతో అన్నానా? ట్రోఫీ అని నాలో నేనేమైనా అనుకున్నానా? సీటిచ్చారు, తీసుకున్నాను.

కూర్చోవాలనిపించినప్పుడు వెళ్లి కూర్చుంటాం కానీ, కుర్చీ ఉందని వెళ్లి కూర్చోం కదా.

ఇంకెంత? కళ్లు మూసుకుంటే ఏప్రిల్‌ 12 వస్తుంది. బడ్జెట్‌ సెషన్‌ అయిపోతుంది. మళ్లీ బడ్జెట్‌ సెషన్‌ వరకు మాన్‌సూన్‌కి ఒకసారి, వింటర్‌కి ఒకసారి కళ్లు మూసుకుంటే చాలు. టెర్మ్‌ విరగడౌతుంది.

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు