మాగాణికి మహారాణి

14 Feb, 2018 13:37 IST|Sakshi
అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి పురస్కారం అందుకుంటున్న పారమ్మ (పాతచిత్రం)

మహిళా రైతుల సిరుల పంట

మగాళ్లకు దీటుగా వ్యవసాయం

ఇంటికీ, పంటకూ సమన్వయం

కుటుంబానికి ఆర్థికంగా అండ

ఆమె స్పర్శిస్తే భూమి పులకరించిపోతుంది. పలకరిస్తే చేను పరవశించిపోతుంది. పంట చెప్పినట్టు వింటుంది. పసిడి పంటను చేతికందిస్తుంది. భూమితోనే సహవాసం. భూదేవి అంత సహనం. ఆమె ఇప్పుడు.. ఇంటికే కాదు.. మాగాణికి కూడా మహారాణి. శక్తియుక్తులతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ధీశాలి. అలాంటి మగ‘ధీర’ల విజయగాథలకు అక్షర రూపమిది.

సాలూరు రూరల్‌ (పాచిపెంట): కొండకొనలే ఆమె ప్రపంచం. ప్రకృతితోనే సహవాసం. పంట పొలాలతోనే జీవితం. అధిక దిగుబడులు సాధించడంలో అద్భుతమైన నైపుణ్యం. అవే ఆమెను దేశాధ్యక్షుని ప్రశంసలు అందుకునేలా చేశాయి. ఆ ఆదర్శ గిరిజన మహిళా రైతు పాచిపెంట మండలం పణుకువలస గ్రామానికి చెందిన మంచాల పారమ్మ.

ప్రయోగాలకు పెట్టింది పేరు
వ్యవసాయంలో కొత్త ప్రయోగాలకు పెట్టింది పేరు పారమ్మ. ఆమె సేంద్రియ ఎరువుల వినియోగానికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వ్యవసాయాధికారులు చెప్పే సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించింది. భూమి సారాన్ని బట్టి పంటను సాగు చేస్తూ మెలకువలతో మంచి ఫలితాలు సాధిస్తోంది. పంటల సాగులో ప్రయోగాల వల్లే ఎకరాకు పది క్వింటాళ్లు కూడా రాని రాగులు.. ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడిని సాధించి రైతులందరికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని అప్పటి రాష్టపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి అందుకుంది.

ఓల్డ్‌ఈజ్‌ గోల్డ్‌
అధిక దిగుబడులు సాధించడం వెనుక విజయ రహస్యం ఏమిటని రైతులంతా పారమ్మను ఆసక్తిగా అడుగుతారు. ‘నాకు తెలిసిన పాత విధానాలే అమలు చేస్తున్నాను. వ్యవసాయాధికారులు చెప్పిన సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటిస్తాను. తోటి రైతులతో కలిసి పొలంలో పనులు చేస్తాను. ఇది ఆరోగ్యానికి మంచిది’.. అని వినయంగా పారమ్మ సమాధానమిస్తుంది. కిచెన్‌ గార్డెన్‌లో భాగంగా కూరగాయలను అంగన్వాడీలు, పాఠశాలలకు గతేడాది వరకూ సరఫరా చేసింది. వ్యవసాయంతో పాటు చికెన్‌మదర్‌ పౌల్ట్రీ యూనిట్‌  నిర్వహణ వైపు దృష్టి సారించింది. ధృడమైన సంకల్పం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించగలమని చెబుతోంది.

శభాష్‌ ఎల్లమ్మా..
గరుగుబిల్లి: అందరూ పంటలు పండిస్తారు. కానీ మిరియాల ఎల్లమ్మ కాస్త భిన్నం. రసాయనాల జోలికెళ్లదు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తోంది. అధిక దిగుబడులతో ఆదర్శంగా నిలుస్తోంది. సంతోషపురం పంచాయతీ ఖడ్గవలస గ్రామానికి చెందిన మిరియాల ఎల్లమ్మకు మూడెకరాల పొలం ఉంది. భర్త గుంపస్వామి, కుమారుడు సహకారంతో ఎకరాలో అరటి పంట, 1.5 ఎకరాల్లో వరి, 0.50ò సెంట్లలో అన్నపూర్ణ పంటల నమూనాలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు సేద్యం చేస్తున్నారు. ద్రవజీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తదితర కషాయాలతోనే తెగుళ్లు అదుపు చేస్తోంది. ఎరలు, రంగుపళ్ళాలు వినియోగించి మంచి దిగుబడి సాధిస్తోంది.

ఏటా రూ.1.3 లక్షల ఆదాయం
కుటుంబంలో ఇద్దరు పనిచేస్తే ఖర్చులు పోను ఏడాదికి రూ.లక్షా 30 వేల వరకు ఆదాయం వస్తుందని ఎల్లమ్మ అంటోంది. జట్టు సంస్థ క్లస్టర్‌ కో–ఆర్డినేటర్‌ అన్నపూర్ణమ్మ సూచనల మేరకు మెలకువలు పాటిస్తోంది.

మరిన్ని వార్తలు