ఘనంగా గుడిమెలిగె..

18 Jan, 2018 12:03 IST|Sakshi
సమ్మక్క గుడిలో ముగ్గులు వేస్తున్న మహిళలు

వన దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు 

తొలిరోజే పోటెత్తిన భక్తజనం 

యాటలతో నైవేద్యం సమర్పణ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గుడిలో గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తలస్నానాలు ఆచరించిన పూజారులు గుడికి చేరుకున్నారు. పూజారులు గుడిని శుద్ధి చేసిన అనంతరం ఐదుగురు ఆడపడచులు సమ్మక్క గద్దెలపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అందంగా అలకరించారు. ఆరాధ్య దైవమైన సమ్మక్క తల్లికి ధూపదీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి యాటను బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజలు జరిగాయి.  

పూజలు ఇలా.. 
ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, భోజరావు, నర్సింగరావు, మల్లెల ముత్తయ్య, నాగేశ్వర్‌రావు, పూర్ణ, దూప వడ్డె దొబె పగడయ్య.. సమ్మక్క గుడికి చేరుకున్నారు. ప్రధాన పూజారి కృష్ణయ్య కొత్త చీపురుతో గుడి లోపల బూజును తొలగించి అమ్మవారి శక్తిపీఠాన్ని కడిగి శుద్ధి చేశారు. అలాగే, పూజ దీపాంతాలు గుడి లోపల, బయట శుభ్రపరిచారు. మరోవైపు పూజారి నాగేశ్వర్‌రావు అమ్మవారి దీపంతాలను శుద్ధి చేశారు. నాగేశ్వర్‌రావు, మరో పూజారితో కలిసి విత్ర స్థలంలోని ఎర్ర మట్టిని తీసుకొచ్చారు. కృష్ణయ్యే స్వయంగా సమ్మక్క గద్దెను మట్టితో అలికారు. అనంతరం పూజారులందరూ కలిసి పూజారి మునీందర్‌ ఇంటికి వెళ్లారు. 

( గుడిని శుద్ధి చేస్తున్న పూజారులు )

మునీందర్‌ ఇంటి నుంచి పసుపు, కుంకుమలు.. 
పూజారి మునీందర్‌ ఇంట్లో అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ, పూజ సామగ్రిని తయారు చేశారు. పూజ సామగ్రిని సిద్ధం చేసే వరకు ఇతరులను ఇంట్లోకి అనుమతించలేదు. తర్వాత ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య పసుపు, కుంకుమ, పూజ వస్తువులను పట్టుకోగా, నాగేశ్వర్‌రావు దీపాలను తీసుకొచ్చారు. మరో పూజారి మల్లెల ముత్తయ్య ఇత్తడి  చెంబులో నీళ్లు, ఐదురుగు ఆడపడచుల్లో  సిద్ధబోయిన భారతి మరో ఇత్తడి చెంబులో నీళ్లు పట్టుకుని డోలి వాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకున్నారు. మూడుసార్లు గుడి చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అప్పటికే పూజారులు ఐదు కట్టల కొత్తగడ్డిని తీసుకొచ్చి గుడి వద్ద ఉంచారు. దానిని పూజారి కృష్ణయ్య చేతుల మీదుగా ఈశాన్యంలోని గుడిపై సంప్రదాయబద్ధంగా పేర్చారు. ఆ తర్వాత గుడిలోపలికి ప్రవేశించారు. పూజారులకు సంబంధించిన ఐదుగురు ఆడపడచులు సిద్ధబోయిన భారతి, సునీత, సుగుణ, రాణి, కొక్కెర వినోద కలిసి మట్టితో అలికిన సమ్మక్క గద్దెపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అలంకరించారు. ప్రధాన ప్రవేశ ద్వారం ముందు కూడా ముగ్గులు వేశారు.  

తల్లులకు నైవేద్యం.. 
గుడి అలంకరణ పూర్తయ్యాక వడ్డెలు సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారి శక్తి పీఠాన్ని వడ్డెలు ముగ్గులు వేసిన గద్దెపై ప్రతిష్ఠించారు. ధూపదీపాలు, కల్లుసారా అరగించి తల్లికి రహస్య పూజలు నిర్వహించారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాటను జడత పట్టి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. పూజలు ముగిసే వరకు గుడి తలుపులు మూసివేశారు. గుడిమెలిగె సందర్భంగా కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోని వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వడ్డెలు రాత్రంతా దేవతల గద్దెల ప్రాంగణంలో జగారాలు చేశారు.  
 

మరిన్ని వార్తలు