నోటితో శ్వాస అందించి.. ప్రాణం పోసిన యువతి

23 Jul, 2018 10:19 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలో ఓ యువతి సమయస్పూర్తి ఓ మనిషి ప్రాణాలను కాపాడగలిగింది. చైనాలోని జింజూ సమీపంలోని రైల్వే స్టేషన్‌లో 81 ఏళ్ల వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతోన్న ఓ యువతి వెంటనే స్పందించింది. వృద్ధుడిని పడుకోబెట్టి, అతని పై మోకాళ్ల మీద కూర్చుని రెండుచేతులనూ కలిపి బలంగా అతని ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కింది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించింది. ఇలా అరగంట పాటూ ఈ ప్రక్రియను కొనసాగించింది. సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సీటేషన్) ప్రక్రియ ద్వారా కుప్పకూలిన మనిషికి తిరిగి ప్రాణం పోసింది.


వృద్ధుడికి సీపీఆర్‌ విధానం ద్వారా ప్రాణం పోసిన యువతిని జింజూలోని మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌ డింగ్‌ హుయ్‌గా గుర్తించారు. వృద్ధుడి ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమైన డింగ్‌ హుయ్‌ ఇంటికి వెళ్లాల్సిన ట్రైన్‌ని కూడా మిస్సయింది. యువతి చూపిన చొరవకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.


ఇక మనదేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాల్లో సగం కేవలం ప్రథమచికిత్స అందకే సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటును గుర్తించగానే తక్షణ ప్రథమచికిత్సగా సీపీఆర్ చేయాలి. సీపీఆర్‌ కేవలం వైద్యులు లేక పారామెడికల్‌ సిబ్బంది మాత్రమే కాకుండా కొద్దిపాటి శిక్షణ పొందిన ఎవరైనా చేయొచ్చు. సీపీఆర్‌ వల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరిగి, అది మెదడుకు చేరి అవయవాలకు తగిన సంకేతాలనివ్వటంతో బాధితుడు వేగంగా ప్రమాదం నుంచి బయటపడతాడు.

ఇలా చేయాలి..
ముందుగా గుండెపోటుతో పడిపోయిన బాధితుడిని పడుకోబెట్టాలి. అతని పక్కనే ఎవరైనా మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా బాధితుడి ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్‌ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. ఒకరి కంటే ఇద్దరు సీపీఆర్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

జాగ్రత్తలు

సీపీఆర్‌ కు ముందు బాధితుడు సృహలో ఉన్నాడా లేదా అని గమనించాలి. ఆ వ్యక్తి స్పందించకపోతే పెద్దగా అరవాలి.

► సీపీఆర్ చేసేటప్పుడు భుజాన్ని అటూ ఇటూ కదిలిస్తూ అతనికి ధైర్యం చెప్పాలి. ప్రమాదం లేదని హామీ ఇవ్వాలి.

► బాధితుడికి గాలి ఆడకుండా చుట్టూ జనాలు మూగితే వారిని పక్కకు వెళ్లేలా చూడాలి. 

► ఒకవేళ అప్పటికే బాధితుడు సృహ కోల్పోయి స్పందించకపోతే వెంటనే అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వాలి.

అవసరం మేరకు 'ఎఇడి'
సీపీఆర్ తో చెప్పుకోదగ్గ ఫలితం లేని కేసుల్లో ఎఇడి (ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిల్లేటర్‌) తప్పనిసరి. ఎఇడి పరికరంలో రెండు ప్యాడ్‌లను బాధితుడి ఛాతి మీద పెట్టి విద్యుత్ షాక్‌ ఇస్తారు. ‘షాక్‌ ఇవ్వండి, ఆపండి’ అంటూ పరికరం చేసే సూచనలను పాటిస్తూ చేయాలి. పెద్ద పెద్ద కార్యాలయాలు, అపార్టుమెంట్లు, సమావేశ మందిరాల వద్ద తప్పనిసరిగా వీటిని అందుబాటులో ఉంచగలిగితే ఇప్పుడు సంభవించే మరణాల్లో 30 నుంచి 50శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు