తుపాకీ వదిలి అభివృద్ధికి చేయి కలపండి

21 Nov, 2023 01:16 IST|Sakshi
ట్యాంకును ప్రారంభిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

సీలేరు: మావోయిస్టులు తుపాకీని వదిలి జనజీవన స్రవంతిలో కలిసి గిరిజన గ్రామాల అభివృద్ధికి చేయి కలపాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా పిలుపునిచ్చారు. దుప్పులవాడ పంచాయతీ మారుమూల ప్రాంతమైన గొరిలోవలో పోలీసుల సహకారంతో రూ.10 లక్షలతో నిర్మించిన మంచినీటి వాటర్‌ ట్యాంకును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందలేదన్నారు. ప్రస్తుతం వారి కదలికలు తగ్గడంతో గ్రామాలభివృద్ధి చెందుతున్నాయని, అందుకు పోలీసుశాఖ ఎప్పుడూ అండగానే ఉంటుందని అన్నారు. మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఇప్పటికే పోలీసుశాఖ ద్వారా గిరిజన గ్రామాల్లో రోడ్లు, మంచినీటి ట్యాంకులు, సదరం క్యాంపులు, బస్‌ పాసులు, ప్రేరణ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం మరింత అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గిరిజన నిరుద్యోగులకు అండగా..

ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో గిరిజన యువతీ యువకులకు పోలీసు శాఖ నిరంతరం అండగా ఉంటుందని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు శాఖ ద్వారా ఉద్యోగాలు పొందారన్నారు. బెంగళూరులో ఐఫోన్‌ తయారీ కంపెనీల్లో గిరిజన యువత ఉన్నారన్నారు. ప్రస్తుతం గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని బ్యాంకుల ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు. మావోయిస్టుల వైపు, గంజాయి వైపు మళ్లకుండా ఉండేలా గంజాయి రహిత జిల్లాగా ఈ ప్రాంతాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకు మీ సహకారం కూడా అవసరమని కోరారు. మావోయిస్టు పార్టీల్లో ప్రస్తుతం ఉన్న కాకూరు పండన్న జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ అతని వదినను కలిసి కొంత నగదు ప్రోత్సాహకంగా అందజేశారు. ఏజెన్సీలోని సమాచార వ్యవస్థ బలోపేతానికి పెద్ద ఎత్తున సెల్‌టవర్ల నిర్మాణానికి పోలీస్‌శాఖ కృషిచేస్తోందన్నారు. అనంతరం గిరిజన క్రీడకారులకు వాలీబాల్‌ పోటీలు నిర్వహించి, వెయ్యి మందికి భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అదనపు ఎస్సీ ప్రశాంత్‌శివకిషోర్‌, సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐలు రామకృష్ణ, అప్పలసూరి, సర్పంచ్‌ కుమారి పాల్గొన్నారు.

ఎస్పీ తుహిన్‌ సిన్హా

గొరిలోవలో మంచి నీటి ట్యాంక్‌ ప్రారంభం

మరిన్ని వార్తలు