‘బండారు’ భూదాహానికి దివ్యాంగురాలి బలి

16 Sep, 2023 13:21 IST|Sakshi

అనంతపురం: అధికారం ఉన్నా లేకపోయినా టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. నేటికీ భూ దందాలకు పాల్పడుతున్నారు. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. గత ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రావణి తండ్రి బండారు రవి కుమార్‌ భూ దాహానికి తాజాగా ఓ దివ్యాంగురాలు బలైంది. తనకు జరిగిన మోసాన్ని ఆ అభాగ్యురాలు ఉరేసుకోబోతూ సెల్ఫీ వీడియోలో వివరించడం విషాదం నింపింది. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామానికి చెందిన నాగరాణి అలియాస్‌ రాజమ్మ (44) దివ్యాంగురాలు.

ఆమెకు గ్రామ సర్వే నంబర్‌–218.2లో 3.67 ఎకరాల భూమి ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ భూమిని రాజమ్మ తల్లి సాకే నాగమ్మ తన చిన్నాన్న అయిన బండారు నారాయణస్వామి వద్ద రూ. 25 వేలకు కుదువ పెట్టింది. అయితే, రూ. కోటి విలువ చేసే ఈ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నారాయణ స్వామి కుమారుడు బండారు రవి కుమార్‌ భావించాడు. ఇటీవల నాగమ్మ మృతి చెందగా, కుదువ పెట్టిన భూమిని విడిపించుకునేందుకు 10 రోజుల క్రితం రూ. 25 వేలకు వడ్డీ, అసలు కలిపి రూ.1.25 లక్షలు తీసుకుని బండారు రవి కుమార్‌ ఇంటికి రాజమ్మ వెళ్లింది.

అయితే, ఆ భూమి తమదని, వేరే వారికి అమ్మేస్తున్నామని ఆయన దౌర్జన్యం చేశాడు. దీంతో రాజమ్మ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. జరిగిన విషయాన్ని తన బంధువులతో చెప్పి బోరున విలపించింది. ఈ క్రమంలోనే గురువారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకునికి బలవన్మరణానికి పాల్పడింది. ఉరేసుకునే ముందు తనకు జరిగిన అన్యాయాన్ని సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోలో వివరించింది. శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బండారు శ్రావణి తండ్రి బండారు రవి కుమార్‌ తన భూమిని లాక్కున్నారని వాపోయింది.

ఏవో మాటలు చెప్పి ఇటీవల తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపించింది. రాజమ్మ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు, ఎంపీటీసీ నాగేంద్ర సమాచారం మేరకు సీఐ నాగార్జున రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టు కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజమ్మ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు