Sakshi News home page

‘సత్యసాయి జయంత్యుత్సవాలకు విచ్చేయండి’

Published Wed, Nov 15 2023 12:18 AM

గవర్నర్‌తో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ 
మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జె.రత్నాకర్‌ రాజు  - Sakshi

ప్రశాంతి నిలయం: ‘అందరినీ ప్రేమించి, అందరినీ సేవించు’ అంటూ ప్రపంచ వ్యాప్తంగా భక్తులను పొందిన సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ బృందం ఆహ్వానించింది. మంగళవారం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జె.రత్నాకర్‌రాజుతో పాటు ట్రస్ట్‌ సభ్యులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను మార్యాదపూర్వకంగా కలిశారు. సత్యసాయి జయంత్యుత్సవాల్లో భాగంగా ఈనెల 22న సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరుగుతుందని, వేడుకల్లో పాల్గొనాలని కోరారు. అందుకు గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని ప్రశాంతి నిలయం మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

అటవీ శాఖలో పదోన్నతులు

అనంతపురం సెంట్రల్‌: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అసిస్టెంట్‌ కన్జర్వేటర్స్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారులకు సబ్‌ డీఎఫ్‌ఓగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం రేంజ్‌ పరిఽధిలో బుక్కపట్నం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌కు పలమనేరు సబ్‌ డీఎఫ్‌ఓగా, కళ్యాణదుర్గం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రామ్‌సింగ్‌కు శ్రీశైలం సబ్‌ డీఎఫ్‌ఓగా పదోన్నతి కల్పించారు.

అసభ్యకర ప్రవర్తన కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్‌

అనంతపురం క్రైం: బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న కేసులో నిందితుడైన జ్యోత్సకుమార్‌ అనే ఉపాధ్యాయుడిని ‘దిశ’ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ‘దిశ’ డీఎస్పీ ఆంథోనప్ప మీడియాకు వెల్లడించారు. మూడు నెలల క్రితం ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జ్యోత్సకుమార్‌ అక్కడ చదువుకుంటున్న బాలికలకు అశ్లీల వీడియోలు చూపించి.. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఓ బాధితురాలి తల్లి ఇటీవల ‘దిశ’ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద సీఐ గోవిందు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు మంగళవారం రాత్రి జ్యోత్సకుమార్‌ను అరెస్ట్‌ చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారు ఎంతటివారైనా సరే చట్టం కఠినంగా శిక్షిస్తుందని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement
Advertisement