పంటల నిల్వకు 9,000 కొత్త గోదాములు

27 Jul, 2020 03:53 IST|Sakshi

వాటికి అనుబంధంగా పంటల్ని ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫామ్‌లు

శీతల గిడ్డంగులు, సార్టింగ్, గ్రేడింగ్‌ యూనిట్ల నిర్మాణం

మొత్తంగా రూ.4 వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా

గోడౌన్ల నిర్మాణానికి రూ.3,150 కోట్లు 

ఇతర నిర్మాణాలు, యూనిట్లకు రూ.350 కోట్లు  

సాక్షి, అమరావతి: మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరో 9 వేల కొత్త గోదాములు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అనుబంధంగా పంటల్ని ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌లు సైతం నిర్మించనుంది. ప్రస్తుతం మార్కెటింగ్‌ శాఖకు మండల, జిల్లా స్థాయిలో 1,055 గోదాములు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 9 లక్షల టన్నులు కాగా.. రైతు బంధు పథకానికి వినియోగించగా మిగిలే గోదాములను భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు మార్కెటింగ్‌ శాఖ అద్దెకు ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో పంటల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, పశువుల మేత, మందుల విక్రయాలు వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. వీటికి గోదాముల కొరత రాకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
► మార్కెటింగ్‌ శాఖపై గురువారం నిర్వహించిన సమీక్షలో కొత్త గోదాముల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 
► మొత్తం రూ.4 వేల కోట్లతో గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మించడంతోపాటు వీటికి అనుబంధంగా సార్టింగ్, గ్రేడింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
► వీటిలో ఒక్క గోదాముల నిర్మాణానికే రూ.3,150 కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఇతర నిర్మాణాలు, యూనిట్ల ఏర్పాటుకు రూ.350 కోట్లు ఖర్చు కాగలదని అధికారులు అంచనా వేశారు.
► కొత్తగా నిర్మించే ఒక్కో గోదాము నిల్వ సామర్థ్యం 500 టన్నులు. తుపానులు, వర్షాలు కురిసిన సమయంలో పంటలు తడిచిపోకుండా ఉండేందుకు వీటిని వినియోగిస్తారు. 
► అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని నిర్మిస్తుండటంతో రైతులెవరైనా ఎరువులకు పెద్ద మొత్తంలో ఆర్డరు ఇస్తే... వాటిని ఈ గోదాముల్లో నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు.

నిధుల సేకరణ, టెండర్లకు చర్యలు
మార్కెటింగ్‌ శాఖను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. అవసరమైన నిధుల సేకరణ, టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంటల్ని ఆరబెట్టుకునే ప్లాట్‌ఫామ్‌తోపాటు 500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో ఒక్కో గోడౌన్‌  నిర్మాణానికి రూ.35 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశాం. దశల వారీగా వీటిని నిర్మిస్తాం. సత్వరమే వీటిని నిర్మించే పనులను మా శాఖతోపాటు ఇతర ఇంజనీరింగ్‌ శాఖలకు అప్పగించాలా,  మా శాఖలోనే అదనపు డివిజన్‌ ఏర్పాటు చేయాలా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నాం.
– ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్‌ శాఖ

మరిన్ని వార్తలు