359 కేంద్రాల్లో కరోనా పరీక్షలు | Sakshi
Sakshi News home page

359 కేంద్రాల్లో కరోనా పరీక్షలు

Published Mon, Jul 27 2020 3:51 AM

359 coronavirus testing centres - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 నిర్ధారణ కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని జిల్లా, తాలూకా, పలు మండల కేంద్రాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో తక్షణ నిర్ధారణ, చికిత్స నినాదంతో ఈ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలకు అనుమతిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 359 కేంద్రాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలుచేసే ల్యాబ్‌లు 39 ఉన్నాయి. వీటిలో 23 ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తుండగా, 16 ల్యాబ్‌లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ 39 మినహా మిగతా 320 కేంద్రాలు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ సెంటర్స్‌ (ఆర్‌ఏటీసీ). వీటిని ప్రాంతీయ, క్లస్టర్‌ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటుచేశారు. మొత్తం 359 కేంద్రాల్లో ఒక్కోదాంట్లో రోజూ సగటున 45 చొప్పున 15 వేలకు పైగా శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 15,654 పరీక్షలు చేశారు. ప్రస్తుతం శాంపిల్స్‌ సేకరణను మరింత పెంచి పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలివే..
ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు అధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మొత్తం 39 ల్యాబ్‌ల్లో ఆర్టీపీసీఆర్‌/సీబీనాట్‌ పద్ధతిలో పరీక్షలు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం నిర్వహించే 16 ల్యాబ్‌ల్లో 9 హైదరాబాద్‌లో ఉండగా, మిగతా 7 వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, గద్వాల, కొత్తగూడెం, కరీంనగర్‌లో ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆధ్వర్యంలో కొనసాగుతున్న 23 ల్యాబ్‌లు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. ఇక, ఆర్‌ఏటీసీ పద్ధతిలో నిర్వహిస్తున్న సెంటర్ల (320)ను జిల్లాల వారీగా చూస్తే– రంగారెడ్డిలో 28, మేడ్చల్‌లో 79, హైదరాబాద్‌లో 97, ఆదిలాబాద్‌లో 3, కొత్తగూడెంలో 6, జగిత్యాలలో 3, జనగామలో 1, భూపాలపల్లిలో 2, ములుగులో 4, గద్వాలలో 2, కామారెడ్డిలో 8, కరీంనగర్‌లో 4, ఖమ్మంలో 4, ఆసిఫాబాద్‌లో 2, మహబూబాబాద్‌లో 3, మహబూబ్‌నగర్‌లో 3, నారాయణపేటలో 3, మంచిర్యాలలో 4, మెదక్‌లో 3, నాగర్‌కర్నూల్‌లో 5, నల్లగొండలో 5, నిర్మల్‌లో 4, నిజామాబాద్‌లో 10, పెద్దపల్లిలో 4, సిరిసిల్లలో 1, సంగారెడ్డిలో 6, సిద్దిపేటలో 5, సూర్యాపేటలో 4, వికారాబాద్‌లో 5, వనపర్తిలో 3, వరంగల్‌ రూరల్‌ 3, వరంగల్‌ అర్బన్‌లో 2, యాదాద్రిలో 4 చొప్పున ఉన్నాయి. 

Advertisement
Advertisement