శభాష్‌.. పోలీస్‌..

25 May, 2022 04:31 IST|Sakshi
ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నా సంయమనం పాటిస్తూ పరిస్థితిని అదుపులోకి తేవడానికి యత్నిస్తున్న పోలీసులు

సంయమనంతో అల్లర్లను కట్టడిచేసిన పోలీసులు

అమలాపురానికి తక్షణం వెళ్లిన విశాఖ సీపీ, ఏలూరు డీఐజీ, ముగ్గురు ఎస్పీలు

కోనసీమకు అదనపు పోలీసు బలగాలు

పరిస్థితిని సమీక్షించిన డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: అమలాపురంతోసహా కోనసీమలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టింది. అత్యంత సమర్థంగా, సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. కోనసీమలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు అమలాపురంలో మంగళవారం మధ్యాహ్నం అల్లర్లు, విధ్వంసానికి పాల్పడిన విషయం తెలియగానే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కేంద్రం అమలాపురంలో ఉన్న పోలీసు బలగాలు తక్షణం రంగంలోకిదిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించాయి.

అల్లరిమూకలు ఎస్పీ సుబ్బారెడ్డితోపాటు 20 మందిపై రాళ్లతో దాడిచేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా వ్యవహరించారు. ఆందోళనకారులను హెచ్చరించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. కానీ పక్కా పన్నాగంతో విధ్వంసరచన చేస్తున్న అల్లరిమూకలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయినప్పటికీ పోలీసు కాల్పుల వరకు పరిస్థితి దిగజారకుండా పోలీసు అధికారులు, బలగాలు అత్యంత సంయమనంతో వ్యవహరించాయి. డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.

పరిస్థితి చేయిదాటుతోందని గుర్తించగానే అదనపు పోలీసు బలగాలను అమలాపురానికి పంపించారు. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రాజమహేంద్రవరం ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌లను వెంటనే అమలాపురం వెళ్లాలని ఆదేశించారు. విశాఖపట్నం, కృష్ణాజిల్లాల నుంచి కూడా అదనపు పోలీసు బలగాలను అమలాపురానికి తరలిస్తున్నారు.

అమలాపురంతోపాటు కోనసీమ అంతటా పరిస్థితిని పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకల్లా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ముందుగానే దాదాపు నాలుగువేల మందిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి అల్లర్లు, దాడులకు పాల్పడేలా కొన్ని శక్తులు కుట్రపన్నాయని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పోస్టులు తదితరాలను పరిశీలిస్తున్నారు. అమలాపురంలో అల్లర్ల సమయంలో తీసిన వీడియో ఫుటేజీ, ఫొటోల ఆధారంగా కుట్రదారులు, అల్లర్లకు పాల్పడ్డవారిని గుర్తించనున్నారు. 

అల్లర్లకు బాధ్యులపై కఠిన చర్యలు
అమలాపురంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. అసాంఘిక శక్తులు రాళ్లు రువ్వినా సంయమనం కోల్పోకుండా పోలీసులు సమర్థంగా వ్యవహరించారు. విధ్వంసానికి పాల్పడినవారు, అందుకు కుట్రపన్నినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని కోరుతున్నా.
    – కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ 

మరిన్ని వార్తలు