అదో పెద్ద ఆర్థిక నేరం.. లోతైన దర్యాప్తు అవసరం

29 Oct, 2020 04:03 IST|Sakshi

అమరావతిపై హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారానే భూముల కొనుగోళ్లు

స్పష్టమైన ఆధారాలన్నీ కోర్టు ముందుంచుతాం

తదుపరి విచారణ నవంబర్‌ 2కు వాయిదా

అప్పటి వరకు పిటిషనర్లపై కఠిన చర్యలొద్దన్న న్యాయస్థానం

సాక్షి, అమరావతి: అమరావతి భూముల కొనుగోలు వ్యవహారం ఓ పెద్ద ఆర్థిక నేరమని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌ శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. దీనిపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ వ్యవహారంలో సీఐడీ ఇటీవల నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సన్నిహితులు కిలారు రాజేశ్, ఆయన భార్య శ్రీహాస, నార్త్‌ఫేస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా క్రిమినల్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కిలారు రాజేశ్‌ తదితరులు దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలు జస్టిస్‌ రజనీ ముందుకు రాగా, లలిత సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన వ్యాజ్యం జస్టిస్‌ లలిత ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ రజనీ తన ముందున్న రెండు వ్యాజ్యాలను కూడా జస్టిస్‌ లలిత వద్దకు పంపారు. దీంతో మొత్తం మూడు వ్యాజ్యాలపై జస్టిస్‌ లలిత బుధవారం విచారణ జరిపారు.

పక్కా వ్యూహంతో భూముల కోనుగోలు 
‘ప్రభుత్వంలో ఉన్న పరిచయాలు, పదవులను అడ్డం పెట్టుకుని, అమరావతి చుట్టు పక్కల ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది.. ఏ ఏ ప్రాజెక్టులు వస్తాయి.. తదితర వివరాలు ముందే తెలుసుకుని,  రైతుల నుంచి నామమాత్రపు ధరలకు భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందారు. అమరావతి భూముల కొనుగోళ్లు మొత్తం ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ ద్వారానే జరిగాయి. ప్రస్తుత కేసులో సీఐడీ తన ప్రాథమిక విచారణ ద్వారా ఈ విషయాన్ని తేల్చాకే పిటిషనర్లపై కేసు నమోదు చేసింది. అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతాం’ అని ఏజీ శ్రీరాం వాదించారు. హైకోర్టు ఇందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 2కు వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్టే కోసం పట్టుపట్టగా, సోమవారం వరకు ఎలాంటి కఠిన చర్యలుండవని ఏజీ స్పష్టంగా చెప్పారు. సోమవారం వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ న్యాయమూర్తి ఆదేశించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు