కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ

3 Jun, 2021 05:05 IST|Sakshi
భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఆనందయ్య

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ముత్తుకూరు/నెల్లూరు (సెంట్రల్‌): కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మందును భారీగా తయారుచేసి 13 జిల్లాలకు పంపి కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. మందు తయారీ, పంపిణీ క్యాంపును కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ కోసం ఒక బ్లాక్‌ కేటాయించారు. భారీ గ్రైండర్, వంటపాత్రలు, మందు తయారీకి దినుసులను సమకూరుస్తున్నారు. 60 వేలమందికి సరిపడా మందును ఆదివారం రాత్రి తయారు చేసి, 13 జిల్లాలకు సోమవారానికి పంపాలని యోచిస్తున్నారు.

అవసరమైతే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి తేనె సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మందుకోసం ఇతర జిల్లాల వారెవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. మందును అవసరమైన వారి చిరునామాకుగానీ, లేదా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారాగానీ అందించేలా చూస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో 4 ప్రాంతాల్లో మందును పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోమవారం నాటికి మందు పంపిణీని ప్రారంభించి రానున్న రోజుల్లో మరింతగా నిల్వలను సిద్ధం చేసి అన్ని జిల్లాలతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా పంపాలని నిర్ణయించారు. 

మందు తయారీ కోసం సొంత భవన నిర్మాణానికి ఆనందయ్య భూమిపూజ
ఆయుర్వేద మందు తయారీకి కావాల్సిన భవన నిర్మాణానికి ఆనందయ్య కృష్ణపట్నంలోని తన స్థలంలో బుధవారం భూమిపూజ చేశారు. భగవాన్‌ వెంకయ్యస్వామి అనుచరుడైన సైదాపురం మండలం తలుపూరు ఆశ్రమానికి చెందిన నారాయణదాసు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో రోగులకు వైద్యసేవలు అందించడం, సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం కోసం ‘ఆనందయ్య సేవా ట్రస్టు’కూ శ్రీకారం చుట్టారు.

దుష్ప్రచారాలొద్దు: నారాయణ 
ఆనందయ్య మందుపై దుష్ప్రచారం చేయవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం కృష్ణపట్నంలో ఆనందయ్యను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఆనందయ్య ఆయుర్వేద మందును రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. పుత్తూరు ఎముకల కట్లు, హైదరాబాద్‌లో చేపమందు వలే ఆనందయ్య మందు ప్రజల ఆదరణ పొందిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు