తనిఖీ కమిటీలో తెలంగాణ అధికారా?

5 Aug, 2021 03:11 IST|Sakshi

ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం.. తదుపరి విచారణ 9కి వాయిదా 

సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేయనున్న బృందంలో తెలంగాణకు చెందిన అధికారిని ఎలా నియమిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన అభ్యంతరాలపై జస్టిస్‌ రామకృష్ణన్, నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. తనిఖీ బృందంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి నియమితులైన వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కావడంతో ఏపీ అభ్యంతరం చెబుతోందని, స్వయంగా తామే తనిఖీలు చేపడతామని కృష్ణా బోర్డు ధర్మాసనానికి తెలిపింది. ఆయన తెలంగాణకు చెందిన వారైనప్పటికీ యూపీఎస్సీ నుంచి సర్వీసుకు ఎంపికయ్యారని, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి కాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచంద్రరావు, పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ధర్మాసనంలోని నిపుణుడు సత్యగోపాల్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని తాము కూడా ఆరోపించగలమని రాంచంద్రరావు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అంశాలు వచ్చినపుడు.. ఉయ్‌ ఆర్‌ లైక్‌ బ్రదర్స్,  న్యాయపరమైన కేసులు విచారించను అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  ఎన్‌వీ రమణ పేర్కొన్నారని జస్టిస్‌ రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇతర సభ్యులెవరూ లేకుండానే కృష్ణా బోర్డు తనిఖీలు చేస్తానంటోంది కాబట్టి చేయనిద్దాం.. అని సూచించారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు లేకుండా కృష్ణా బోర్డు తనిఖీలు చేస్తానంటే అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి తెలిపారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ కోసం పనులు చేపడుతున్నారా? పిటిషనర్, తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నారా? అనే అంశాలను తనిఖీ చేసి తెలియచేయాలని కృష్ణా బోర్డును ధర్మాసనం ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు మూడు వారాలు సమయం కావాలని కృష్ణా బోర్డు కోరగా, అంత సమయం ఇవ్వబోమని, ఈ నెల 9లోగా అందించాలంటూ తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.     

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు