సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనా రెగ్యులరే

1 Jul, 2022 03:26 IST|Sakshi

ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం కలిగించిన ప్రభుత్వం

కంపార్ట్‌మెంటల్‌ పాస్‌ విధానం లేకుండా మార్కులు

కోవిడ్‌ కారణంగా విద్యార్థులు నష్టపోకుండా చర్యలు

2021–22 విద్యా సంవత్సరం వరకే వర్తింపు

ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఇవ్వాలని తల్లిదండ్రుల వినతి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ (జూలై, 2022) పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురందించింది. ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్‌మెంటల్‌ అని కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్‌ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ మెమో జారీ చేశారు.

ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. 2021–22కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను జూన్‌ 6న విడుదల చేశారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. 

విద్యార్థులకు వెసులుబాట్లు..
కోవిడ్‌తో తలెత్తిన ఇబ్బందులతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించేలా చర్యలు తీసుకుంది. సాధారణంగా రెగ్యులర్‌ పరీక్షల్లో ఫెయిలై సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఆయా సబ్జెక్టులలో ఎన్ని మార్కులు సాధించినా కంపార్ట్‌మెంటల్‌ పాస్‌గానే పరిగణిస్తారు తప్ప డివిజన్లను కేటాయించరు. అయితే ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు పరీక్ష ఫీజు రద్దు
జూలై 6 నుంచి 15 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.  విద్యార్థులు చెల్లించాల్సి న రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఈసారి రెగ్యులర్‌ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్‌లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్‌మెంట్‌ పరీక్షల విధానం లేదు.

కానీ కోవిడ్‌తో విద్యార్థులు ఇబ్బందిపడటంతో వారికి మార్కులను పెంచుకునేందుకు ఈ అవకాశం కల్పించింది. 49, అంత కంటే తక్కువ మార్కులు వచ్చినవారు రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనే ఈ బెటర్‌మెంట్‌ విద్యార్థులూ పరీక్షలు రాయనున్నారు. కాగా టెన్త్‌ విద్యార్థులకు మాదిరిగానే ఇంటర్మీడియెట్‌ విద్యార్థులను కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో కంపార్ట్‌మెంటల్‌ పాస్‌గా కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణించి డివిజన్లు ఇవ్వాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. 

మరిన్ని వార్తలు