మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్: ప్రపంచబ్యాంక్ నివేదిక

9 May, 2021 03:10 IST|Sakshi

కోవిడ్‌ సమయంలో సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఆంధ్రప్రదేశ్‌..

మిగతా రాష్ట్రాల కంటే బెస్ట్‌

ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి 

గ్రామీణ ప్రజల ఆహార భద్రతకు ఢోకా లేకుండా చర్యలు

లాక్‌డౌన్‌ సమయంలోనూ నేరుగా నగదు బదిలీతో భారీగా లబ్ధి

గత మే నెలలో 75 శాతం గ్రామీణులకు సర్కారు సహాయం

గత జూన్‌లో సగటున కుటుంబానికి రూ.2,866 సాయం 

ఉపాధి హామీ కింద అత్యధిక మందికి పని కల్పించిన రాష్ట్రం 

కోవిడ్‌ పట్ల అవగాహన, నివారణ చర్యల్లోనూ ముందంజ

దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో సాయం అందలేదు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అనేక రాష్ట్రాలు అనుసరించడం చూశాం.. వాటికి పలు అధ్యయన సంస్థలు కితాబులివ్వడం విన్నాం... ఇప్పుడవి  రాష్ట్రాలను, దేశాలను దాటి ప్రపంచబ్యాంకు వరకు చేరాయి. ముఖ్యంగా గతేడాది కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు నిశ్చింతగా ఉండడాన్ని ప్రపంచబ్యాంకు గుర్తించింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు... నేరుగా అందుతున్న నగదు పేద ప్రజల జీవితాలకు ఎనలేని భరోసాగా మారాయని అది కితాబునిచ్చింది. దేశంలోనే అత్యధికంగా గత జూన్‌లో రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటున రూ.2,866 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నగదు అందించిందని ప్రపంచ బ్యాంకు సర్వేల్లో వెల్లడైంది.

కోవిడ్‌–19, దీర్ఘకాలిక లాక్‌డౌన్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావంపై రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రపంచ బ్యాంకు సర్వే నిర్వహించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడలేదని, ఉపాధికి కూడా ఎలాంటి కొరత లేదని సర్వేలో వెల్లడైంది. మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం కుటుంబాలకు నగదు బదిలీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహాయం అందించిందని, ఇది ఇతర రాష్ట్రాల కన్నా అత్యధికమని సర్వే స్పష్టం చేసింది. గత జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సగటున ఒక్కో కుటుంబానికి అత్యధికంగా రూ.2,866 చొప్పున ఆర్థిక సాయం అందించగా, ఉత్తరప్రదేశ్‌ రూ.1,071 చొప్పున సాయం చేసిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంతోపాటు సడలింపు సమయంలో కూడా పేదలకు ఆహార భద్రత కింద పెద్ద ఎత్తున బియ్యం పంపిణీ జరిగింది. 

ఉపాధిలో ముందంజ..
గత ఏడాది జూన్‌లోప్రభుత్వం అందచేసిన నగదు బదిలీ డబ్బును బ్యాంకులు, ఏటీఎంల నుంచి తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని అత్యధిక శాతం మంది తెలిపారు. కేవలం 3 శాతం మంది మాత్రమే నగదు ఉప సంహరణ చేసుకోలేకపోయినట్లు ప్రపంచ బ్యాంకు సర్వేలో తేలింది. గత జూన్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీతో పాటు వివిధ పథకాల కింద ఇచ్చిన నగదు బదిలీ డబ్బులతో ఆంధ్రప్రదేశ్‌లో సగటు కుటుంబం ఆదాయం వారానికి రూ.5,000 వరకు ఉండగా మిగతా రాష్ట్రాల్లో రూ.1,000 నుంచి రూ.1,500 వరకే ఉందని సర్వేలో వెల్లడైంది.

ఉపాధి హామీ కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. రాష్ట్రంలో జూలైలో ఉపాధి హామీ కింద పనులు కల్పించినట్లు 84.5 శాతం మంది పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో 65.6 శాతం మందికి పనులు కల్పించినట్లు సర్వేల్లో తేలింది. కోవిడ్‌ విషయంలో అవగాహనపై కూడా ప్రపంచ బ్యాంకు మూడు రౌండ్లు సర్వే నిర్వహించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం మందికి అవగాహన ఉన్నట్లు తేలింది. 

మరిన్ని వార్తలు