నీటి లభ్యత విపరీతంగా పెరిగింది: మంత్రి అనిల్‌‌

27 Sep, 2020 19:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుభిక్షంగా వర్షాలు పడి, డ్యామ్‌లు నిండటంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అనిల్ కుమార్ యాదవ్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కన్న ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్‌ మాట్లాడుతూ.. అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో చెరువులు నిండటంతో పాటు రిజర్వాయర్లు నిండుకున్నాయని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు వస్తోందని, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించామని అన్నారు. కాగా ప్రకాశం బ్యారేజీ రాత్రి కి 7 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించామని తెలిపారు.

భారీ వర్షాలకు గ్రౌండ్ వాటర్ పెరగడంతో నీటి లభ్యత విపరీతంగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా ఉన్నారని, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే ఖరీఫ్‌లో సైతం రికార్డు స్థాయిలో పంటల దిగుబడులు వస్తాయని  ఆశిస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 

మరోవైపు వరద పరిస్థితి పై జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్ టేలికాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాగా ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు, స్నానాలకు వెళ్ళడం చేయరాదని  ఇంతియాజ్ ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు